
మాట్లాడుతున్న మల్లాది విష్ణు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): రాజధాని ప్రాంతం అంటే కేవలం ఏలూరురోడ్డు, బందరురోడ్డు, గన్నవరం నుంచి అమరావతికి వెళ్లే రోడ్లేనా నగరంలో మిగిలిన 59 డివిజన్లలో ప్రాంతాలు కనిపించడం లేదా.. ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలు పడుతున్న బాధలను పట్టించుకోరా అని వైఎస్సార్‌సీపీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని నిలదీశారు.
సింగ్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. విష్ణు మాట్లాడుతూ సత్యనారాయణపురం, రైల్వేకాలనీ, వన్‌టౌన్ ప్రాంతాలలో జరుగుతున్న హత్యలు, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న చోరీల సంఘటనలు వింటుంటే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చలేని అసమర్థ ప్రభుత్వ పాలన సాగుతోందని విమర్శించారు. తాగునీరు లేక, డ్రైనేజీలలో మురుగునీరు తొలగించక నాలుగేళ్ల నుంచి నగర ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ పాలకులు ఇప్పుడు గ్రామదర్శిని, ఇంటింటికి టీడీపీ అనే పేరుతో తిరగడం సిగ్గుచేటని అన్నారు. గతంలో నాలుగు సార్లు ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు మళ్లీ పర్యటనలు చేయడమేంటని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, 12 వేల ఇళ్లను టీడీపీ పాలకులు, నాయకులు తమ అనుచరులకు పంచుకోవడం, మరికొన్ని అమ్ముకోవడం చేశారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి విచారణ చేపట్టి నిజమైన నిరుపేదలకు ఇల్లు అందేలా చూడాలని కోరారు. ప్రభుత్వ పథకాలను, పింఛన్లను టీడీపీ నాయకులు వారి ఇళ్ల వద్ద పార్టీ కార్యాలయాల్లో పంపిణీ చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. రాజీవ్‌నగర్‌లో నిర్మించిన కళ్యాణమండపాన్ని టీడీపీ నాయకులు తమ ఆఫీస్‌లా వాడుకోవడంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.