![Mallikarjun Kharge as new chief of congress party - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/2/malli.jpg.webp?itok=270DyfnL)
మల్లిఖార్జున్ ఖర్గే
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అధ్యక్ష పదవికి చేసిన రాజీనామాను వెనక్కుతీసుకునేందుకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యమైంది. పార్లమెంటు సమావేశాల అనంతరం ఆగస్టు 8 లేదా 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీ జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
అక్కడే రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించడం, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరగుతుందని పేర్కొన్నాయి. ఆగస్టు 15న పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కొత్త అధ్యక్షుడే జెండా వందనం చేస్తారన్నాయి. పార్లమెంటు సమావేశాల తరువాత సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం గురువారం ప్రకటించారు. కానీ భేటీ తేదీలను ఆయన వెల్లడించలేదు. భేటీలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని చెప్పారు. కాగా, పార్లమెంటు సమావేశాలను ఆగస్టు 9న వరకు పొడిగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment