సమావేశంలో మాట్లాడుతున్న భట్టి. చిత్రంలో చాడ వెంకట్‌రెడ్డి, ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి, దాని పరిధిలోని 11 బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వివిధ రాజకీయ పార్టీల రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. కరోనా పరిస్థితుల ముసుగులో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ను తెరమీదకు తెచ్చారని, లాభాల బాట లో ఉన్న సంస్థలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరించడం దుర్మార్గమైన చర్య అని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. సింగరేణి పరిరక్షణకు కార్మిక సంఘాలతో కలసి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఈ అంశంపై గవర్నర్, సీఎం, సీఎస్‌లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై స్పందించిన సీఎం కేసీఆర్, సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదని నేతలు ప్రశ్నించారు. బుధ, గురువారాల్లో కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న నిరసనలకు అఖిలపక్షం మద్దతు ప్రకటించింది. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించారు. మంగళవారం మఖ్దూం భవన్‌లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎల్‌పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే దేశ ఆర్థిక పరిస్థితి ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోతుందని, ప్రజాస్వామ్యాన్ని ప్రైవేట్ శక్తులు శాసించే పరిస్థితి వస్తే అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం బడాబాబుల చేతుల్లో బందీ అయ్యే పరిస్థితి వస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. సింగరేణి పరిరక్షణకు విశాల ఉద్యమాన్ని చేపట్టాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని చాడ ధ్వజమెత్తారు. సమావేశంలో ఎల్.రమణ (టీటీడీపీ), డీజీ నరసింహారావు (సీపీఎం), కె.గోవర్ధన్, రమాదేవి (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), వివిధ కార్మిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment