
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ఉమ్మడి కరీంనగర్‌లో మాట్లాడిన మాటలు గవర్నర్ హోదాను, పదవిని కించపరిచినట్లున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు మీద పెట్టిన ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లి.. ఆ పేరును ఎందుకు తీసేశారని ప్రశ్నించకపోవడం విచారకరమన్నారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రారంభించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గవర్నర్‌కు కనిపించలేదా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖరరావు అని, హరీశ్‌రావును కాళేశ్వరరావు అని గవర్నర్ అభివర్ణించారని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే రేపు రాజ్‌భవన్‌ను టీఆర్ఎస్ భవన్ అంటారేమోనన్న బాధ కలుగుతుందన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా కాళేశ్వరం పూర్తయ్యేదన్నారు. ఇతర పార్టీల వారిని టీఆర్ఎస్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించి రాజ్యాంగాన్ని గవర్నర్ అవమానపరిచారని, ఇప్పుడు ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment