నల్లగొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి
తెలంగాణ సాయుధ పోరాట యోధుల కుటుంబం నుంచి వచ్చిన మల్లు లక్ష్మి.. నల్లగొండ లోక్‌సభ ఎన్నికల బరిలో సీపీఎం అభ్యర్థిగా నిలిచారు. మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అంటోన్న ఆమె.. కాంగ్రెస్, బీజేపీ అవినీతిలో అన్నదమ్ములేనని అంటున్నారు. నిత్యం ప్రజల పక్షాన ఉండే వామపక్ష పార్టీలే కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీలని నినదిస్తున్న ఆమె.. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా. ‘సాక్షి’తో ఆమె మనోగతం..
చెప్పింది చేస్తా..
నల్లగొండ నియోజకవర్గానికి సంబంధిం చి.. ప్రధానంగా మాచర్ల–నల్లగొండ, బీబీనగర్–ఖాజీపేట రైల్వే డబుల్ లైన్ల ఏర్పాటు, సూర్యాపేట–విజయవాడ ప్రత్యేక లైను ఏర్పాటుకు కృషి చేస్తా. సీఎం కేసీఆర్ మహిళల కోసం పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తానని చెప్పినా.. చేయలేదు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. రైతులకు గిట్టుబాటు ధర, శ్రీశైలం సొరంగ మార్గం పూర్తికి కృషి చేసి ఫ్లోరిన్ శాశ్వత పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా.
మల్లు లక్ష్మి
స్వగ్రామం: మొల్కపట్నం, వేములపల్లి మండలం
భర్త: మల్లు నాగార్జున్ రెడ్డి
సంతానం: ఇద్దరు తనయులు
తల్లిదండ్రులు: నామిరెడ్డి రాములమ్మ, జనార్దన్‌రెడ్డి
అత్తామామలు: మల్లు స్వరాజ్యం, వెంకటనర్సింహారెడ్డి
విద్యార్హతలు: బీఏ, ఎల్‌ఎల్‌బీ
రాజకీయానుభవం: ఐద్వా నాయకురాలు, రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్ రాజకీయాలకు రాకముందు: గృహిణి, విద్యాభ్యాసం.
ఉద్యోగ కల్పనే ఎజెండా..
రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. కార్మికులు పనుల్లేక వలస పోతున్నారు. ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి. మఠంపల్లి, మేళ్లచెర్వు ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీల్లో స్థానికులకు అవకాశమిచ్చేలా ఒత్తిడి తెస్తాం. నాగార్జునసాగర్‌లో జాతీయ పర్యాటక కేంద్రం కోసం కృషి చేస్తా. సాగునీటి వైఫల్యాలపై ప్రభుత్వాలనుపార్లమెంట్‌లో నిలదీస్తా. ప్రతి ఒక్కరికీనాణ్యమైన సమాన విద్య అందిస్తా.
అవగాహన ఉంది..
మా అత్తామామలు తెలంగాణ రైతాంగ పోరాట యోధులు. వారి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. ఐద్వా నాయకత్వంలో పనిచేశా. నల్లగొండలో డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల రుణాలు, గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేశాను. పోలీసులు లాఠీచార్జి చేశారు. రెండు రోజులు జైలు జీవితం కూడా గడిపా. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలపై పోరాడా. ఏడు కిలోమీటర్లు పాదయాత్ర చేశా. 2006లో నా అత్తగారి ఊరైన రాయినిగూడెం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌నయ్యా. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమస్యలపై పోరాడిన అనుభవం ఉంది. సమస్యలన్నీ తెలుసు.
మహిళా రిజర్వేషన్..
మహిళా రిజర్వేషన్ సాధించాలి. అప్పుడే మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యం లభిస్తుంది. అదే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తా. మహిళాభ్యున్నతికి పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తా.
అవే నా ప్రధాన ప్రచారాస్త్రాలు..
నిత్యం ప్రజల్లో ఉన్నా.. మహిళా, కార్మిక సమస్యలపై పోరాడా, ఏకగ్రీవ సర్పంచ్‌గా ఉండి ఉద్యమించి అప్పటి వైఎస్ ప్రభుత్వ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు సాధించా. డ్వాక్రా మహిళా సమస్యలపై పోరాడా, కార్మికులు, కర్షకులు, రైతాంగ సమస్యలపై నినదించాం. ఇవన్నీ ఎన్నికల్లో విజయానికి దోహదపడతాయి.–ఎన్.క్రాంతీపద్మ, సాక్షి– నల్లగొండ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment