మహబూబాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత
‘పోడు భూములు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన మహిళల సంక్షేమం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే అవకాశం ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్తున్నాను’ అంటున్న మహబూబాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవితతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
మహిళలకు ఉపాధి..
మహబూబాబాద్ (మానుకోట) నియోజకవర్గంలో కోయ, గోండు, లంబాడాలు ఎక్కువ. చాలా కుటుంబాల్లో మగవాళ్లు సారా తాగి చనిపోతూ ఉంటారు. ఆడవాళ్లు చిన్న వయసులోనే వితంతువులవుతుంటారు. ప్రభుత్వం ఇచ్చే ఉపాధి అవకాశాలను అలాంటి మహిళలకు అందేలా చూస్తాను. చేతి వృత్తులు, కుటీర పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తా. లంబాడీలకు విస్తరాకుల కట్టల తయారీ వంటి చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.
ప్రధాన లక్ష్యాలు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు రావడం ప్రధాన లక్ష్యాలు. పోడు భూముల రైతుల సమస్యల పరిష్కారం కూడా తొలి ప్రాధాన్యతాంశమే. రెండు రోజుల కిందట ఇల్లందు కార్యకర్తల సమావేశానికి వెళ్తే టౌన్‌లో రైల్వేస్టేషన్ నిర్మాణం గురించి ప్రస్తావించారు. సింగరేణి కార్మికుల సమస్యలపైనా దృష్టి పెడతా.
తండ్రి అనుభవమే పాఠం
మా నాన్న డీఎస్ రెడ్యానాయక్ మాజీ మంత్రి. ఆయన అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని డోర్నకల్. ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నేను ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి ఎమ్మెల్యేగా కూడా చేశాను. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, సమస్యలు నాకు తెలుసు. ప్రతి సమస్యపై అవగాహన ఉంది. పోడు భూముల సమస్య తీరి కనీస మౌలిక వసతులు మెరుగు పర్చేందుకు కృషి చేస్తా.
సంక్షేమమే ప్రచారాస్త్రం
కేసీఆర్ సంక్షేమ పథకాలే మా ప్రధాన ప్రచార అస్త్రాలు. ఓ పెద్దమనిషి కనిపిస్తే ఆసరా చెప్పి ఓటడుగుతా. రైతు కనిపిస్తే రైతుబంధు, రైతుబీమా గురించి చెప్పి ఓటడుగుతా. చిన్న పాపనెత్తుకున్న తల్లి కనిపిస్తే కేసీఆర్ కిట్ గురించి చెప్పి ఓటేయమంటా. కడుపుతో ఉన్న ఆడబిడ్డి కనిపిస్తే పాప కడుపులో పడ్డప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఏమేమి ఇస్తున్నామో గుర్తు చేసి ఓటేయ్యమని అడుగుతా. అందరి ఇండ్లకెళ్లి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు చెప్పి ఓటడుగుతా. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న పార్టీ మాది. ఆ మేలే గెలిపిస్తుంది.– గడ్డం రాజిరెడ్డి, సాక్షి– వరంగల్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment