రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ
నెహ్రూనగర్ (గుంటూరు) : తెలుగుదేశం పార్టీలో ఉన్న మాదిగలు వెంటనే బయటికి రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. వచ్చే మార్చి 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం గుంటూరులో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన బీజేపీ.. నాలుగేళ్లు గడుస్తున్నా నాలుగు అడుగులు కూడా వేయలేదన్నారు.
టీడీపీ ప్రభుత్వం కూడా హామీని నెరవేర్చకుండా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టిందని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఏ పార్టీ అయితే తమకు మద్దతు తెలుపుతుందో ఆ పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. వర్గీకరణ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎలా ఒత్తిడి తీసుకురావాలనే విషయంపై ఆదివారం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అ«ధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment