
కర్ణాటకలోని మంగళూరు–శివమొగ్గ రూట్‌లో వెళుతోంది ఆ బస్సు. రోజులాగే ప్రయాణికులతో బస్సు నిండుగా ఉంది. వెళుతున్న బస్సు ఒకసారిగా రోడ్డు పక్కకొచ్చి ఆగిపోయింది. వెంటనే డ్రైవర్ బస్సులోంచి దిగి పక్కనున్న కేంద్రానికి పరుగెత్తాడు. కొన్ని నిమిషాల తర్వాత వచ్చి బస్సు స్టార్ట్ చేసి యథాప్రకారం ముందుకు సాగాడు. దారి మధ్యలో బస్సు ఆగడం, డ్రైవరు ఎక్కడికో పరుగెత్తుకెళ్లడం చూసి ప్రయాణికులు ముందు కంగారుపడ్డారు. ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. అయితే, తిరిగొచ్చిన డ్రైవర్ చేతి చూపుడు వేలు మీదున్న సిరా చుక్క చూశాక జరిగిందేమిటో వారికి అర్థమయింది. విధి నిర్వహణలో ఉంటూ కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటేసి వచ్చిన ఆ డ్రైవరును అంతా అభినందించారు.
ఆ డ్రైవరు పేరు విజయ్ శెట్టి. జయరాజ్ ట్రావెల్స్‌లో గత పదేళ్లుగా డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఇటీవల అతని నియోజకవర్గంలో పోలింగు జరిగింది. ఆరోజు సెలవయినా కూడా జయరాజ్ డ్యూటీ చేశాడు. అలాగే, ఓటు కూడా వేశాడు. ప్రయాణికులతో గమ్య స్థానం వెళుతూ దారిలో బెలువాయిలో తన ఓటున్న పోలింగు కేంద్రం దగ్గర బస్సాపి ఓటేసొచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే పని ముగించుకురావడంతో ప్రయాణికులు కూడా చిరాకుపడలేదు. శెట్టి ఓటు వేసిరావడాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టారు. వందల మంది దాన్ని షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అయింది. అందరూ ఓటు విలువ తెలిసిన మనిషంటూ శెట్టిని అభినందించారు. ప్రజలకు ఓటు విలువ తెలియజేసిన ఈ డ్రైవరును సన్మానించనున్నట్టు దక్షిణ కర్ణాటకకు చెందిన సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కమిటీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment