మేధావుల భాగస్వామ్యంతో మేనిఫెస్టో! | Manifesto with the intellectual partnership! | Sakshi
Sakshi News home page

మేధావుల భాగస్వామ్యంతో మేనిఫెస్టో!

Published Sun, Jun 24 2018 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Manifesto with the intellectual partnership! - Sakshi

శనివారం ఆలిండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ సింపోజియం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న గీతారెడ్డి. చిత్రంలో మర్రి శశిధర్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: దేశ సుస్థిర అభివృద్ధికి మేధావుల సహకారంతో 2019 ఎన్నికలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో తయారుచేస్తుందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. నిపుణుల సహకారంతోనే సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు సాధ్యమవుతాయని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా, వారి సూచనలు దేశాభివృద్ధికి ఎంతో సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో తయారీలో భాగంగా ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లోని ఫ్యాప్సీ భవనంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్‌ సింపోజియం జరిగింది. ఆలిండియా ప్రొఫెషనల్స్‌ కాంగ్రెస్‌ తెలంగాణ శాఖ అధ్యక్షుడు శ్రవణ్‌ దాసోజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మేధావులు, పర్యావరణవేత్తలు హాజరై సలహాలు అందించారు.  

సింపోజియాలతో మంచి సలహాలు.. 
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, దక్షిణ భారత ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ సమన్వయకర్త గీతారెడ్డి హాజరయ్యారు. సామాజిక న్యాయం, సుస్థిర అభివృద్ధి కోసం మేధోమథనం ఎంతో ఉపకరిస్తుందని ఆమె చెప్పారు. ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సింపోజియాలు మంచి ఫలితాలిస్తున్నాయని, దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దే మంచి సలహాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడటం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడలేకపోతే దేశవనరులను కాపాడలేమని అభిప్రాయపడ్డారు.  

సమస్యలపై చర్చ జరగట్లేదు.. 
సుస్థిర అభివృద్ధిలో రాజకీయ పార్టీల పాత్ర అనే అంశంపై జౌళి బోర్డు సభ్యుడు దొంతి నర్సింహారెడ్డి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో అన్ని అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజలతో నిరంతర చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని చెప్పారు. దేశంలో ఉన్న అనేక సమస్యలపై చర్చ జరగట్లేదని, సగటు మనిషికి అవసరమయ్యే ప్రజాపంపిణీ నుంచి మంచినీటి సరఫరా వరకు ఎన్నో సమస్యలెదురవుతున్నా ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్చలను రాజకీయ పార్టీలు పట్టించు కోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ప్రొఫెసర్‌ సుబ్బారావు మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు మెరికల్లాంటి రాజకీయ నిర్వాహకులు కావాలని అన్నారు. ఎప్పటికప్పుడు కొత్త అంశాలను కలుపుకొని అభివృద్ధి లక్ష్యాలను చేరే ప్రణాళికలకు రూపకల్పన చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
అడుగంటుతున్న భూగర్భ జలాలు.. 
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పంట భూములున్నా నీళ్లులేక రైతులు సాగుచేయలేక పోతున్నారని ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో విపరీతంగా రసాయనాల వాడకం వల్లే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని, దీనిపై రాజకీయ పార్టీలు తమ విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలివ్వాలని, ఇందుకు పోరాడుతున్నామని, ఇంటి నుంచి మొదలైన వివక్ష అడుగడుగునా కొనసాగడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలని లింగ సమానత్వం కోసం పోరాడుతున్న శ్రావ్యరెడ్డి అభిప్రాయపడ్డారు.  

చెప్పిందొకటి... చేస్తున్నదొకటి 
రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల అమలులో నిర్లక్ష్యం చూపడం దురదృష్టకరమని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకోవడం కోసం ప్రజాకర్షక మేనిఫెస్టోలు ప్రజల ముందుకు తెచ్చి ఓట్లు దండుకున్నాక, వాటిల్లోని అంశాలను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీలు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇంకోటి చేశారని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని, మేధావుల సలహాలు, సూచనలతో తెలంగాణ అభివృద్ధి నమూనాను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో సయ్యద్‌ అహ్మద్‌ అమీరుద్దీన్, ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్‌ సికింద్రాబాద్‌ అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అజీజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయ నాయకురాలు బాలలక్ష్మి, కాంగ్రెస్‌ నాయకులు ఫిరోజ్‌ ఖాన్, తులసీరావు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement