పనజి : కాబినెట్ నుంచి ఇద్దరు మంత్రులను తొలగించి వారి స్థానంలో కొత్త మంత్రులను నియమించేందుకు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా, విద్యుత్ శాఖ మంత్రి పాండురంగ్ మద్‌కైకర్‌లను కాబినెట్ నుంచి తొలగించారు. అనారోగ్యం కారణంగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి స్థానంలో మిలింద్ నాయక్, నీలేశ్ కార్బాల్ గవర్నర్ మృదులా సిన్హా సమక్షంలో సోమవారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆయనకో రూల్.. మంత్రులకో రూల్!!
గత జూన్‌లో బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన మద్‌కైకర్.. ఇప్పటికీ అక్కడ చికిత్స పొందుతున్నారు. మరో మంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా కూడా పలు అనారోగ్య కారణాల వల్ల అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. అయితే వీరి గైర్హాజరీతో ఆయా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన పరీకర్ వారిద్దరిని కాబినెట్ నుంచి తొలగించారు. దీంతో సీనియర్లను తప్పించడం కంటే కూడా దాని వెనుక ఉన్న కారణం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది.
ఎందుకంటే గత ఏడు నెలలుగా ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న మనోహర్ పరీకర్ ముంబై, అమెరికాల్లో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా పరీకర్ అనారోగ్యాన్ని కారణంగా చూపి, రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. అయితే గోవా సీఎంగా పరికర్ కొనసాగుతారని బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులకో న్యాయం, సీఎంకి ఓ న్యాయం అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment