
సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్ డైరెక్టర్ల పదవులు ఏకగ్రీవమయ్యాయి. శనివారం నామినేషన్లు సమర్పించాల్సి ఉండగా, ఒక్కో డైరెక్టర్ పదవికి ఒకరే నామినేషన్ వేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహకార ఎన్నికల అథారిటీ ప్రకటించింది. మొత్తం ఏడు డైరెక్టర్ పదవులకుగాను, ఆరింటికి మాత్రమే ఒక్కో నామినేషన్ దాఖలయ్యాయి. మరో డైరెక్టర్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఆరు డైరెక్టర్ పదవులను ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. రేకుల గంగాచరణ్, ఎస్. జగన్ మోహన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, మర్రి రంగారావు, మార గంగారెడ్డి, ఎన్.విజయ్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
ఏకగ్రీవాలతో తప్పిన ఎన్నికల నిర్వహణ
డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కావడంతో ఆ రోజు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకవేళ ఒక్కో డైరెక్టర్ పదవికి రెండు అంతకుమించి నామినేషన్లు దాఖలైనట్లయితే, ఈ నెల పదో తేదీన ఎన్నికలు నిర్వహించేవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు ఈ నెల 11న చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. వారి మధ్య పోటీ నెలకొంటే ఎన్నిక నిర్వహిస్తారు. లేకుంటే ఆ రెండు పదవులు కూడా ఏకగ్రీవమయ్యే అవకాశముంది. ఒక డైరెక్టర్ పదవికి ఒకరు నామినేషన్ వేయడానికి మార్క్‌ఫెడ్‌కు రావడంతో ఘర్షణ నెలకొందని, దీంతో అతను నామినేషన్ వేయకుండానే వెళ్లినట్లు కొంతమంది చెబుతున్నారు. తమ ప్రాంగణంలో ఎటువంటి ఘర్షణ, గొడవలు జరగలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment