
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీస్తుపూర్వం పుట్టినోళ్ల పేర్లు ఓటరు లిస్టులో ఉన్నాయని కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి ఆరోపిం చారు. నకిలీ ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్‌చోద్యం చూస్తోందని, అధికార పార్టీ చెప్పుచేతుల్లోకి ఈసీ వెళ్లిందని విమర్శించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్త డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై సమావేశంలో చర్చించారు.
ఓట్ల తొలగింపు ప్రక్రియపై న్యాయపోరాటానికి సంబం ధించిన అంశమై న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తో చర్చించారు. అనంతరం మర్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 31 లక్షల ఓటర్లు ఎలా తగ్గారని తాము ప్రశ్నిస్తే.. విభజన తర్వాత ఏపీకి వెళ్లడంతో తగ్గారని ఈసీ అంటోందన్నారు. మరి ఏపీలో నూ ఓటర్లు పెరగాల్సింది పోయి, 17 లక్షల ఓటర్లు తగ్గారని, దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రహసనంగా మారిందన్నారు.
పది రోజుల్లో 17 లక్ష ల కొత్త ఓటర్లు నమోదయ్యారని, బహుశా ఇలాం టిది దేశంలోనే ఎక్కడా జరగలేదన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించమంటే సర్వర్ పనిచేయడం లేదంటున్న ఈసీ, కొత్త ఓటర్ల నమోదుకు సర్వర్ ఎలా పనిచేస్తోందని ప్రశ్నించారు. 10 రోజుల్లో కొత్త గా నమోదైన ఓటర్ల జాబితాను తేదీల వారీగా తమ కు ఇవ్వాలన్నారు. కొత్తగా నమోదు చేసిన ఓటర్ల జాబితాను తమకు ఇస్తే.. అందులోని డూప్లికేట్‌లను 2 రోజుల్లో తొలగిస్తామని జంధ్యాల అన్నారు.