
సాక్షి,హైదరాబాద్: అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, తప్పుడు ఓటర్ల జాబితా రూపొందిస్తే సహించేది లేదని ఎన్నికల అధికారులను తెలంగాణ పీసీసీ ఎన్నికల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి ఎన్నికల అధికారులు తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేదం టే ఎవరినీ వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు.
గాంధీభవన్‌లో శుక్రవారం సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నిరంజన్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటరు నమోదు ప్రక్రియ అంతా హైకోర్టు పర్యవేక్షణలో జరగడం ప్రజాస్వామ్యవాదుల విజయంగా పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు బూత్‌స్థాయి వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలను గుర్తించాలన్నారు.
ఓటర్ల తుది జాబితాను తమకు అందిస్తే, ఎన్నికల కమిషన్ తప్పులను గాంధీభవన్ సాక్షిగా స్క్రీన్‌పై నిరూపిస్తామని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినంత మాత్రాన ఎవరు ఏమీ చేయలేరనుకోవడం తప్పని ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 12న వస్తుందని, అప్పటి వరకూ ఓటరుగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని దీనిపై ఈసీని సైతం నిలదీయవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment