‘గరుడ’ ముసుగులో భారీ కుట్ర | Massive conspiracy in the name of Operation Garuda | Sakshi
Sakshi News home page

‘గరుడ’ ముసుగులో భారీ కుట్ర

Published Sun, Oct 28 2018 4:19 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

Massive conspiracy in the name of Operation Garuda - Sakshi

సాక్షి, అమరావతి: ‘ఆపరేషన్‌ గరుడ’ ముసుగులో సీఎం చంద్రబాబు పథకం ప్రకారం భారీ కుట్ర పన్నారా? తిరుగులేని ప్రజాదరణతో బలీయమైన శక్తిగా అవతరించిన వైఎస్సార్‌సీపీకి చెక్‌ పెట్టడంతోపాటు తన పాలనలో అక్రమాలను కప్పిపుచ్చుకోవడం, వైఫల్యాలను కేంద్రంపై నెట్టేయడం, ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోకముందే గరుడ పురాణాన్ని రచించి సినీనటుడు శివాజీతో ప్రచారం చేయించడమే లక్ష్యంగా పావులు కదిపారా? రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అంతమొందించి దాన్ని కేంద్రంపై మోపాలనుకున్నారా? అనే ప్రశ్నలకు అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి కేంద్ర బలగాల పహారాలో ఉండే విమానాశ్రయాన్ని ఎంచుకోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోందని చెబుతున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో జట్టు కట్టినా కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికారాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన  ఏ ఒక్క హామీనీ  అమలు చేయలేకపోయారు. సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుంచి రాజధాని భూములు, నిర్మాణ పనుల వరకూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి లక్షలాది కోట్ల రూపాయాలను దోపిడీ చేయడంలో టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసంతో వైఎస్సార్‌ సీపీ అధికారానికి దూరమైనా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అక్రమాలను ఎండగడుతూనే.. మరో వైపు  రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వంతో పోరాడారు. గతేడాది నవంబర్‌ 6 నంంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా సంకల్పయాత్ర పేరుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర అశేష జనాదరణ మధ్య అప్రతిహతంగా సాగుతోంది. అత్యంత ప్రజాదరణతో తిరుగులేని రాజకీయ శక్తిగా వైఎస్సార్‌ సీపీ ఆవిర్భవించిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఒకే దెబ్బకు రెండు పిట్టలు:
రాష్ట్రంలో తన పాలనపై ప్రజా వ్యతిరేకత నానాటికీ బలపడుతుండటంతో నలభైయేళ్ల రాజకీయ అనుభవంతో భారీ కుట్రకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్రమాలను కప్పిపుచ్చుకోవడం, తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టేయడం, వైఎస్సార్‌ సీపీకి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో గరుడపురాణం రచనకు పూనుకున్నారు. ఈ ఏడాది మార్చి 16 నాటికి గరుడ పురాణం రచనను పూర్తి చేసిన సీఎం చంద్రబాబు.. అదే రోజున ఎన్డీయేతో తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆ తరువాత రెండు రోజులకే కేంద్ర మంత్రివర్గం నుంచి తన పార్టీకి చెందిన మంత్రులతో రాజీనామా చేయించారు. ఆ తర్వాత మార్చి 22న తాను రచించిన గరుడ పురాణాన్ని సినీ నటుడు శివాజీ ద్వారా.. ఎల్లో మీడియా సహకారంతో విస్తతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి యత్నించారు. టీడీపీ ఎమ్మెల్సీ బీద మస్తాన్‌ రావు, వైఎస్సార్‌ సీపీ నుంచి ఎన్నికై టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు సినీ నటుడు శివాజీ ఆపరేషన్‌ గరుడలో చెప్పినట్లుగానే తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపై క్షక్ష సాధింపు చర్యల్లో భాగంగా.. ఈ దాడులు చేయిస్తోందని సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేశారు. సీఎం చంద్రబాబు బినామీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేసినప్పుడు గరుడ పురాణాన్నే వల్లె వేశారని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.

పతాక స్థాయికి చేరిన ఆపరేషన్‌
ఆపరేషన్‌ గరుడలో భాగంగా ప్రతిపక్ష నేతపై ప్రాణాపాయం లేని రీతిలో దాడి చేసేందుకు హైదరాబాద్, గుంటూరుల్లో రెక్కీ నిర్వహించారని.. ఆ నెపాన్ని రాయలసీమకు చెందిన ఒక ముఖ్యనేత కుటుంబంపై వేసి.. బిహార్, ఒడిశాలకు చెందిన మనుషులతో అల్లర్లు సష్టించి.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిపరుస్తారని సినీ నటుడు శివాజీతో అప్పట్లో చెప్పించారు. కానీ.. అమలులో వ్యూహం కాస్త మార్చారని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు చెప్పారు. ప్రతిపక్ష నేతను అంతమొందించి.. ఆ నెపాన్ని కేంద్రం నెట్టేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని ఎత్తు వేసినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్త అయిన  శ్రీనివాసరావుకు ప్రొఫెషనల్‌ కిల్లర్లతో తర్ఫీదు ఇప్పించి.. విశాఖ ఎయిర్‌పోర్టులో టీడీపీ కీలక హర్షవర్దన్‌ప్రసాద్‌ చౌదరికి చెందిన రెస్టారెంట్‌లో చెఫ్‌ పేరుతో చేర్పించారని చెబుతున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ఠ నిఘా, భారీ భద్రత ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యంత పకడ్బందీగా అత్యంత పదునైన కత్తులను రెస్టారెంట్‌లోకి చేరవేసి.. శ్రీనివాసరావుకు అందించారని పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ విశాఖపట్నం విమానాశ్రయం ద్వారా హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఆయనపై హత్యాయత్నానికి పలు మార్లు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పక్కాగా రూపొందించిన పథకం మేరకు గురువారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అంతమొందించడానికి ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ప్రతిపక్ష నేత ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. 

కేసును నీరుగార్చే కుట్ర
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హత్యాయత్నం నుంచి తప్పించుకోవడంతో కలెక్టర్ల సదస్సు నుంచి బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు పలు మార్లు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌తో మంతనాలు జరిపారు. ఈలోగా ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి చినరాజప్పను బయటకు పంపి.. ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును గంటలో తేల్చుతామని ప్రకటించారు. ఆ తర్వాత డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ మీడియాతో మాట్లాడూతూ ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి చేశారు. చిన్న సంఘటన ఇది.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. పదో పదకొండో పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నాం’ అంటూ విచారణ చేయకుండానే తీర్పును ఇచ్చేశారు.

ఈలోగా ఒక్కో మంత్రి బయటకు వచ్చి శ్రీనివాసరావు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తనేనని.. వైఎస్‌ జగన్‌తో నిందితుడు వేసిన ఫ్లెక్సీ ఇదేనంటూ ప్రదర్శించారు. కానీ.. వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు వేయించే ఫ్లెక్సీల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ విజయమ్మ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ల ఫోటోలు ఉంటాయి. కానీ.. మంత్రులు ప్రదర్శించిన ఫ్లెక్సీలో ఎక్కడా వైఎస్సార్‌ ఫొటో లేదు. ఫైగా గరుడ బొమ్మ ఉండటం గమనార్హం. కానీ.. ఆ మరుసటి రోజు పోలీసులు శ్రీనివాసరావుకు చెందిన వ్యవసాయ పొలం నుంచి తవ్వి తీసిన ఫ్లెక్సీకి.. మంత్రులు ప్రదర్శించిన ఫ్లెక్సీకి ఏమాత్రం పొంతన లేకపోవడాన్ని బట్టి చూస్తే కేసును నీరుగార్చడానికి పథకం ప్రకారమే ఈ డ్రామా ఆడారన్నది స్పష్టమవుతోంది. ఇక నిందితుడు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖలో ముగ్గురి చేతిరాతలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యవహారం మొత్తం తమ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు, మంత్రులు హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ని పరామర్శించాల్సిందిపోయి.. తాము ప్లాన్‌ చేస్తే కత్తులు గుచ్చమని, ఏకంగా ఖైమా (ముక్కలు ముక్కలుగా నరికేయడం) చేస్తామని ప్రకటిస్తుండటంపై తీవ్ర విమర్శులు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్‌ గరుడను తాను రూపొందించకపోతే.. తన ప్రభుత్వాన్ని అస్థిపరిచే ఈ కుట్రపై అప్పట్లోనే చంద్రబాబు ఎందుకు విచారణకు ఆదేశించలేదని సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రశ్నించడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement