జిల్లా మంత్రి దారెటో తెలియడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది మంత్రి పదవి కోసం టీడీపీ కండువా కప్పుకున్న మంత్రి అమరనాథరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఈసారి పలమనేరు టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినేత విముఖత చూపుతున్నట్లు సమాచారం. కంగుతిన్న మంత్రి తన భార్యకైనా టికెట్ ఇవ్వమని అభ్యర్థించినట్లు సమాచారం. అధినేత నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో అమాత్యుడు ఆందోళనలో పడ్డట్టు సమాచారం.
సాక్షి, చిత్తూరు, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన అమరనాథ రెడ్డికి టీడీపీ అధినేత గుణపాఠం చెప్పారని పలమనేరులో చర్చసాగుతోంది. వైఎస్సార్‌సీపీ పలమనేరు అభ్యర్థిగా గెలుపొందిన అమరనాథ రెడ్డి మంత్రి పదవి కోసం టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. మంత్రితో పాటు 2019 ఎన్నికల్లో పుంగనూరు లేదా పలమనేరు టికెట్ అడిగి మాట తీసుకున్నారు. కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నా మంత్రి అమరనాథ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం ఇంకా ప్రకటించలేదు. ఈసారి ఎన్నికల్లో పుంగనూరు టికెట్ అమర్‌కేనని గతంలో చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. అనూహ్యంగా తన సోదరుని భార్య అనీషారెడ్డి పేరు ప్రకటించి షాక్‌కు గురిచేశారు.
పలమనేరు కూడా లేదా?
పుంగనూరు పోయినా పలమనేరైనా ఇస్తారని అమరనాథరెడ్డి భావించారు. చివరకు పలమనేరు కూడా లేదని తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తవారికి అవకాశం ఇద్దామని చెప్పడంతో తన భార్య రేణుకారెడ్డిని అమర్ తెరపైకి తీసుకొచ్చారు. కొద్ది రోజులుగా పలమనేరులో జరిగే ప్రతి కార్యక్రమానికీ తన భార్యను వెంటబెట్టుకుని పర్యటిస్తున్నారు. తాను మాట్లాడిన తరువాత భార్య రేణుకారెడ్డిని ప్రసంగించమని చెబుతున్నారు. కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వాల్సి వస్తే తన భార్యకు అవకాశం ఇవ్వమని అధినేత చంద్రబాబును కోరినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు మాత్రం అమర్ సతీమణికి ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదని విశ్వసనీయ సమాచారం. పలమనేరు లేదు.. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చెయ్యమని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది.
పార్లమెంటుకు పోటీచెయ్యలేను
రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చెయ్యలేనని అమరనాథరెడ్డి అధినేత వద్ద మొరపెట్టుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోయే స్థానం నుంచి పోటీ చెయ్యమనడం వెనుక అంతరార్థం ఏమిటని అమర్ మంత్రి లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన వైఎస్సార్‌సీపీ అధినేతను, పలమనేరు ప్రజలను కాదని టీడీపీలోకి వచ్చినందుకు తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించినట్లు సమాచారం. మంత్రి లోకేష్ నుంచి కూడా ఎటువంటి సమాధానం లేకపోవడంతో అమర్ ఎటు వెళ్లాలో? ఎవరికి చెప్పుకోవాలో? అర్థం కాక తన అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment