సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను గమనించిన అధికార తెలుగుదేశం పార్టీ దానినుంచి బయటపడటం కోసం రాజకీయ డ్రామా మొదలుపెట్టింది. కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామిగా గడిచిన నాలుగేళ్లుగా అధికారం పంచుకున్న టీడీపీ తాజా పరిస్థితుల నేపథ్యంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని బీజేపీపై నెట్టాలన్న ఎత్తగడను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా రంగంలోకి దగి అనంతరం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిత్రపక్షంగా ఉంటూ అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదా, రైల్వో జోన్ వంటివి టీడీపీ సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తడి చేయలేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతులెత్తేసింది.
ప్రధానంగా ఓటుకు కోట్లు వంటి కేసుల కారణంగానే బీజేపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయలేకపోతున్నారని సర్వత్రా వినిపించే మాట. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు జరపకపోవడం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరమీదకు తెచ్చారు. ఒకవైపు ప్రభుత్వంలో కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వంపై పోరాటం చేశామని చెప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికారంలో ఉన్న మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి బడ్జెట్ ను ఆమోదించగా, ఎంపీలతో అరకొర నిరసనలు చేయించి వదిలేస్తున్నారు.
మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భం, దానికితోడు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ రాజకీయ డ్రామా మొదలుపెట్టినట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు నేరుగా స్పందించకుండా కొందరు పార్టీ నేతలు, మంత్రులను తెరమీదకు తెచ్చి వారిద్వారా బీజేపీపై విమర్శలు గుప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ గురువారం విమర్శలకు దిగారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో పొత్తు వదులుకుంటామని గంటా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment