సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సొంతంగా గెలవలేని పరిస్థితుల్లో బురద చల్లడం, బ్లాక్‌మెయిల్ చేయడం, దిగజారుడు రాజకీయాలు చేయడం ద్వారా ఇతర పార్టీలను కాంగ్రెస్ దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన కాంగ్రెస్.. నీటి కేటాయింపుల్లో వివక్షకు గురైన తెలంగాణ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతుబంధు’పథకం అమలు తీరుపై సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ అవగాహన సదస్సు’లో మంత్రి హరీశ్ పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘ఏపీలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ జాతీయ నాయకులు జైరాం రమేశ్ మాట్లాడారు. పక్క రాష్ట్రంపై ఎలాంంటి వ్యతిరేకత, ఈర్ష్య లేదు. కానీ, తెలంగాణకు పారిశ్రామిక, ఐటీ రంగాలకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇస్తామనే విభజన చట్టం హామీ గురించి కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రశ్నించరు’అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర పర్యటన సందర్భంగా.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేలా మాట్లాడింది కేవలం టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ‘బీజేపీకి అనుకూలంగా టీఆర్‌ఎస్ మాట్లాడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల విమర్శలు చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 60ఏళ్లు దాటినా తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ పాలనా వైఫల్యాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. మోదీని గద్దె దించడమో, రాహుల్‌ను అధికారంలోకి తీసుకురావడమో టీఆర్‌ఎస్ పార్టీ సిద్ధాంతం కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం’అని మంత్రి స్పష్టం చేశారు.
కేసీఆర్ చేతుల మీదుగా ‘రైతుబంధు’
వచ్చే నెల 10 నుంచి 17వ తేదీ వరకు 8 రోజు లపాటు జరిగే ‘రైతుబంధు’పథకాన్ని ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభించాల్సిందిగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ను కోరాలని జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఆకాంక్షిస్తున్నట్లు హరీశ్ వెల్లడించారు. జిల్లాలో పర్యటించాలని త్వరలో సీఎంను కలసి విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా రోజుకో జిల్లాలో పర్యటించి రైతుబంధు పథకం అమలును పర్యవేక్షిస్తారన్నారు. రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాలకు సంబంధించి 58 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున అందజేస్తామన్నారు.
కాళేశ్వరంపై హరీశ్ సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు గడువు సమీపిస్తున్నందున పనులు వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఖరీఫ్‌లో గోదావరి నీటిని గరిష్ట ఆయకట్టుకు అందించాలని, మేడిగడ్డ నుంచి మల్లన్నసాగర్ వరకు పనులను వేగిరపరచాలని స్పష్టంచేశారు. సోమవారమిక్కడ జలసౌధలో కాళేశ్వరంపై రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 6 గంటలపాటు మంత్రి సమీక్ష నిర్వహించారు. వానలు మొదలయ్యేందుకు మరో నెలన్నర గడువే ఉన్న నేపథ్యంలో కాంక్రీట్ పనులు, పంప్‌లు, మోటార్ల బిగింపు ప్రక్రియను వేగిరం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment