రేవంత్‌కు జైలుకు వెళ్లాలని తొందరెందుకు? | Minister Jagadish Reddy Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

జైలుకు వెళ్లాలని తొందరెందుకు?

Published Sun, Sep 30 2018 1:21 AM | Last Updated on Sun, Sep 30 2018 10:54 AM

Minister Jagadish Reddy Comments On Revanth Reddy - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో రెండు మూడ్రోజులుగా విచిత్ర డ్రామా జరుగుతోందని విద్యుత్‌ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి ఆయనే వెళ్లి జైలులో కూర్చోవాలనే తొందర ఉన్నట్టుందని విమర్శించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడికుంట వెంకటేశ్వర్లుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ సోదాలు ఒక నేత ఇంటిపై జరిగితే తుపాన్లు వచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్‌ నేతలు ప్రవర్తిస్తున్నారు. మానవాళికి ఏదో ప్రమాదం జరిగినట్టు మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ఐటీ సోదాలు జరుగుతాయి. కాంగ్రెస్‌ నేతలు తమతో జైళ్లు నిండుతాయేమో అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు.

రేవంత్‌పై ఎవరో ఫిర్యాదు చేస్తే వాస్తవాలు తెలుసుకునేందుకు ఐటీ సోదాలు చేసింది. ఇది రేవంత్‌రెడ్డితో మొదలైంది కాదు. ఐటీ సోదాలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. రేవంత్‌ అంటే ఇష్టం లేని కాంగ్రెస్‌ నేతలు కుండల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. టన్నుల కొద్దీ సాను భూతి ప్రకటిస్తున్నారు. తప్పు చేయకపోతే ఆయన జైలుకు వెళ్లరు. పెద్దోళ్లను తిడితే పెద్దోడ్ని అవుతానని కేసీఆర్‌ కుటుంబాన్ని రేవంత్‌ తిడుతున్నారు. ఆయన భాష ఆయన దగ్గరే ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్లు నిలదీస్తారు. దొంగలు దొంగలు ఒక్కటై పోలీస్‌ వ్యవస్థని రద్దు చేయమని అడిగినట్టు ఉంది కాంగ్రెస్‌ నేతల తీరు. రేపు ఐటీ విభాగాన్ని కూడా రద్దు చేయమంటారేమో’అని అన్నారు.  

కులంతో నాయకుల్వరూ...? 
కులం ప్రస్తావన తేవడం నీచమైనదని, కులంతో ఎవరూ నాయకులుగా ఎదగలేరని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘ఇప్పుడున్న అధికారులు కొత్తగా రాలేదు. కాంగ్రెస్‌ హయాంలోనూ ఉన్నారు. అధికారుల నైతిక స్థైర్యాన్ని కాంగ్రెస్‌ దెబ్బతీస్తోంది. ఐదుగురు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపైనా ఐటీ సోదాలు జరిగాయి. రేవంత్‌రెడ్డి కార్యకర్తలను ఇంటికి పిలిపించుకుని సానుభూతి కోసం ప్రయత్నించారు. ఇలాంటి చిల్లర పనులతో కాంగ్రెస్‌కు ఓట్లు పడవు. ఇకనైనా కాంగ్రెస్‌ నేతలు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆలోచించాలి. ఆస్తుల విచారణను సిట్టింగ్‌ జడ్జీలు చేయరు. ఇప్పుడు విచారణ సంస్థలకు సహకరిస్తే చాలు. అన్నీ బయటకు వస్తాయి.

కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ, కేసీఆర్‌లు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మా గ్రామ కార్యకర్త చాలు. కాంగ్రెస్‌ నేతల విమర్శల్లో అసహనం కనిపిస్తోంది. గెలిచే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయి. వారి సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు సీట్లు రావడం లేదు’అని అన్నారు. కాంగ్రెస్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి కోసం రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లను రమ్య (సోషల్‌ మీడియా) ద్వారా రాహుల్‌ గాంధీకి పంపారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఉద్యమకారులను తూలనాడితే వారు ఆయన చర్మం ఒలుస్తారని హెచ్చరించారు. తప్పు చేశానని తెలిసినందునే జైలుకు వెళ్లి నామినేషన్‌ వేస్తానని అన్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement