G Jagadish Reddy
-
పచ్చదనంలో దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన మాదిరిగానే సీఎం కేసీఆర్ హరిత ఉద్యమాన్ని సైతం విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో రూ.3.45 కోట్ల వ్యయంతో నిర్మించిన తంగేడువనం పార్కును మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) విధానంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మంత్రులు పార్కు అంతా కలియతిరిగారు. అలాగే ధర్మోజిగూడెంలోని లక్కారం –1 బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్–విజయ వాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నాటిన విధంగానే గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట సైతం మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.శోభ, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, కలెక్టర్ అనితారామచంద్రన్, అటవీశాఖ సీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కు విజ్ఞప్తి చేశారు. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని 45శాతం వినియోగదారులు ఇప్పటికే ఆన్లైన్లో ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నారని, గత మార్చిలో 55 శాతం వినియోగదారులు ఆన్లైన్లోనే చెల్లించారన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పొడిగించి మూతపడిన పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు ఉపశమనం కల్పించే అంశంపై విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకోలేవని, కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు జారీ చేస్తే కరోనా వ్యాప్తికి అవకాశాలుంటాయని, ప్రత్యామ్నాయంగా ఈఆర్సీ అనుమతితో తాత్కాలిక బిల్లులను ప్రస్తుత ఏప్రిల్ లో వినియోగదారులకు ఎస్ఎంఎస్ల రూపంలో జారీ చేశామని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమానంగా ఈ ఏప్రిల్‌లో బిల్లులు జారీ చేశామన్నారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రెండు నెలల కాలానికి మీటర్ రీడింగ్ తీసి ఏప్రిల్, మే నెలలకు చెరి సగం చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్‌లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులు సర్దుబాటు చేస్తామన్నారు. -
‘ఆయన.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీ’
సాక్షి, హుజూర్నగర్ : హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులెవరు గెలిచినా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి మంత్రి జగదీశ్వర్ రెడ్డి బినామీ అని వ్యాఖ్యానించారు. ఇద్దరూ కలిసి కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు అమ్మారని ఆరోపించారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి గెలిస్తే ఉత్తమ్‌కు తప్ప హుజూర్నగర్ ప్రజలకెలాంటి ప్రయోజనం ఉండదని, ఉత్తమ్‌కుఎ ఆమె జీ హుజూర్ అంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లక్ష్మణ్ గరిడేపల్లి మండలంలో మంగళవారం రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని విఙ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సైదిరెడ్డి గెలిస్తే 107వ ఎమ్మెల్యే అవుతాడు తప్ప ప్రయోజనం లేదు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ కొలువుల ఊసే లేదు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సుమారు 25 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాకూడా యువతకు ఉద్యోగాలు లేవు. ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఉత్తమ్, కేసీఆర్, కేటీఆర్ ఉదయం తిట్టుకుంటారు. రాత్రి వేళల్లో మాట్లాడుకుంటారు. రాష్ట్రంలో 50 వేల మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేసీఆర్ అగ్గితో గోక్కున్నావు. నీ చేతులు, ఒళ్లు కాలడం పక్క’అని లక్ష్మణ్ అన్నారు. -
‘మూసీ’పై అవసరమైన చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు గేటు విరిగిన ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. ఆదివారం ఉదయం మూసీ గేటు ఘటన పరిస్థితుల తీవ్రతను విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంకు ఫోన్లో వివరించారు. దీంతో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పాటు ఈఎన్సీ మురళీధర్‌రావులను మూసీ సందర్శించి, తక్షణ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌తో పాటు ఇంజనీర్లు బేగంపేట నుంచి హెలికాప్టర్లో మూసీ ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. స్టాప్‌లాగ్స్ బిగింపునకు 3 రోజులు అధికారులు మూసీ వద్దకు చేరుకున్నాక అక్కడి పరిస్థితిని సీఎంకు ఫోన్లో వివరించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఎక్కువగా ఉండటం, గేటు ఊడటంతో 10వేల క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తోందనీ,, దీన్ని నిరోధించేందుకు స్టాప్‌లాగ్స్ అవసరమనీ తెలిపారు. వాటిని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) అధికారులు డిజైన్స్ రూపొందించి తయారు చేయించేందుకు కనీసం మూడు రోజులైనా పట్టవచ్చని వివరించినట్లు తెలిసింది. అప్పటిలోగా ప్రాజెక్టులో ఉన్న నీరంతా ఖాళీ అయ్యే అవకాశాలే అధికమని ఇంజనీర్ల అంచనా. ఒకవేళ ప్రైవేటు కాంట్రాక్టర్లకు గేటు అమర్చే పని అప్పగించినా మూడు రోజులు పడుతుందని భావిస్తున్నారు. గేటుకు ఒక పక్కభాగంలో కాంక్రీట్ నిర్మాణం దెబ్బతినడం, ఎగువన నుంచి భారీగా వచి్చన వరద ప్రవాహంతో అది విరిగిపోయినట్లు తెలుస్తోంది. -
విరిగిన మూసీ గేట్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష
సాక్షి, నల్గొండ : జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్ విరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రాజెక్టులోని నీరు వృథాగా పోతుంది. ఈ నేపథ్యంలో మూసీ డ్యామ్ వద్దకు చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మిత సబర్వాల్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఈఎన్సీ మురళీధర్‌రావు.. గేట్ విషయమై నీటిపారుదల అధికారులతో సమీక్ష చేపట్టారు. విరిగిన గేట్‌కు సంబంధించి నిపుణులు రూపొందించిన మ్యాప్‌ను మంత్రి జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. గేట్‌ను తిరిగి యథావిధిగా అమర్చేందుకు అధికారులతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లోనే గేట్‌ను యథావిధిగా అమర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
త్వరలోనే టెట్ పరీక్ష : జగదీష్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యా వైద్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని.. నాణ్యమైన విద్యనందించడమే సీఎం లక్ష్యమని తెలిపారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి పాఠశాలలో టాయిలెట్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. మారుతున్న సమాజ అవసరాల దృష్ట్యా కొత్త కోర్సులు తీసుకురావల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై ముఖ్యమంత్రి గారితో చర్చిస్తామని తెలిపారు. పిల్లలేవరు బడి బయట ఉండకూడదని.. అనాథ పిల్లల్ని కూడా స్థానికంగా ఉండే గురుకులాలు, ఇతర పాఠశాలలో చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తామని వెల్లడించారు. -
రేవంత్‌కు జైలుకు వెళ్లాలని తొందరెందుకు?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు మూడ్రోజులుగా విచిత్ర డ్రామా జరుగుతోందని విద్యుత్ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డికి ఆయనే వెళ్లి జైలులో కూర్చోవాలనే తొందర ఉన్నట్టుందని విమర్శించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాల యంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడికుంట వెంకటేశ్వర్లుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐటీ సోదాలు ఒక నేత ఇంటిపై జరిగితే తుపాన్లు వచ్చినట్టు, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ నేతలు ప్రవర్తిస్తున్నారు. మానవాళికి ఏదో ప్రమాదం జరిగినట్టు మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలకతీతంగా ఐటీ సోదాలు జరుగుతాయి. కాంగ్రెస్ నేతలు తమతో జైళ్లు నిండుతాయేమో అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. రేవంత్‌పై ఎవరో ఫిర్యాదు చేస్తే వాస్తవాలు తెలుసుకునేందుకు ఐటీ సోదాలు చేసింది. ఇది రేవంత్‌రెడ్డితో మొదలైంది కాదు. ఐటీ సోదాలను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు. రేవంత్ అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు కుండల కొద్దీ కన్నీరు కారుస్తున్నారు. టన్నుల కొద్దీ సాను భూతి ప్రకటిస్తున్నారు. తప్పు చేయకపోతే ఆయన జైలుకు వెళ్లరు. పెద్దోళ్లను తిడితే పెద్దోడ్ని అవుతానని కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ తిడుతున్నారు. ఆయన భాష ఆయన దగ్గరే ఉంటుంది. ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు వాళ్లు నిలదీస్తారు. దొంగలు దొంగలు ఒక్కటై పోలీస్ వ్యవస్థని రద్దు చేయమని అడిగినట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. రేపు ఐటీ విభాగాన్ని కూడా రద్దు చేయమంటారేమో’అని అన్నారు. కులంతో నాయకుల్వరూ...? కులం ప్రస్తావన తేవడం నీచమైనదని, కులంతో ఎవరూ నాయకులుగా ఎదగలేరని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘ఇప్పుడున్న అధికారులు కొత్తగా రాలేదు. కాంగ్రెస్ హయాంలోనూ ఉన్నారు. అధికారుల నైతిక స్థైర్యాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తోంది. ఐదుగురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనా ఐటీ సోదాలు జరిగాయి. రేవంత్‌రెడ్డి కార్యకర్తలను ఇంటికి పిలిపించుకుని సానుభూతి కోసం ప్రయత్నించారు. ఇలాంటి చిల్లర పనులతో కాంగ్రెస్‌కు ఓట్లు పడవు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు ఆత్మ పరిశీలన చేసుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ఆలోచించాలి. ఆస్తుల విచారణను సిట్టింగ్ జడ్జీలు చేయరు. ఇప్పుడు విచారణ సంస్థలకు సహకరిస్తే చాలు. అన్నీ బయటకు వస్తాయి. కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టేందుకు మోదీ, కేసీఆర్‌లు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీని ఎదుర్కొనేందుకు మా గ్రామ కార్యకర్త చాలు. కాంగ్రెస్ నేతల విమర్శల్లో అసహనం కనిపిస్తోంది. గెలిచే శక్తి లేక కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయి. వారి సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు సీట్లు రావడం లేదు’అని అన్నారు. కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లను రమ్య (సోషల్ మీడియా) ద్వారా రాహుల్ గాంధీకి పంపారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఉద్యమకారులను తూలనాడితే వారు ఆయన చర్మం ఒలుస్తారని హెచ్చరించారు. తప్పు చేశానని తెలిసినందునే జైలుకు వెళ్లి నామినేషన్ వేస్తానని అన్నారని చెప్పారు. -
సస్పెన్షన్‌తో జానాకే మేలు: జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షనేత జానారెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ఆయనకే మేలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ జానారెడ్డిని సస్పెండ్ చేయకుంటే టీఆర్ఎస్తో కలసిపోయారని కాంగ్రెస్‌వాళ్లే పార్టీ నుంచి సస్పెండ్ చేసేవారన్నారు. మరో ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేసే అంశం స్పీకరు, శాసనసభ పరిధిలోని అంశమన్నారు. -
పుస్తకం..ప్రపంచాన్ని మార్చే ఆయుధం
సాక్షి, హైదరాబాద్ : సమాజ స్వరూపం మారడానికి అక్షరమే పునాదని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలోని భాగ్యరెడ్డి వర్మ ప్రాంగణంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కనులపండువగా ప్రారంభమైంది. జగదీశ్వర్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. అక్షరం పుట్టిన తర్వాతే అనూహ్యమైన మార్పులు వచ్చాయని, పుస్తకమే ప్రపంచ గమనాన్ని మార్చే ఆయుధమని ఈ సందర్భంగా జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో వస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని ఏ వైరస్ అయినా చిటికెలో మాయం చేస్తుందని, పుస్తకంలోని అక్షరాలను ఏ వైరస్ కూడా అడ్డుకోలేదన్నారు. పుస్తకం లేని జీవితానికి పరిపూర్ణత రాదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పుస్తకంతోనే ప్రపంచంలో గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. పుస్తకం మంచి స్నేహితుడని, పుస్తక పఠనం మనిషిని తలెత్తుకొని బతికేలా చేస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. పుస్తకం మనిషికి విలువలతో కూడిన జీవితాన్ని అందిస్తుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28 వరకు జరిగే బుక్ ఫెయిర్ విజయవంతం కావాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆకాంక్షించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘర్షణ: మంత్రి తండ్రికి స్వల్ప గాయాలు
నల్లగొండ: నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. అందులోభాగంగా మంత్రి జగదీష్‌రెడ్డి సమీప బంధువు మందడి విద్యాసాగర్‌రెడ్డి ఇంటిపై మరో వర్గం వారు దాడి చేశారు. అతడి ఇంట్లోకి చొరబడి కారు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన విద్యాసాగర్ కుటుంబ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, గున్నారెడ్డి, మరో వ్యక్తిపై దాడి చేశారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... వారిన కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ ప్రకాష్ రెడ్డి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ ఘటనలో మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. -
నల్గొండలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
నల్గొండ: నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. నల్గొండలోని అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. అనంతరం ఆయన పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాలోని 58 మంది అమరవీరుల కుటుంబాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. -
'ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా ఉంది'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని గెలిపించే సత్తా తమకు ఉందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ... ఎవరికి ఓటు వేయాలో ఎమ్మెల్యేల ఇష్టమని... అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం రహస్యంగానే జరుగుతాయన్నారు. పోటీ చేస్తున్న ఇతర పార్టీల కన్నా తమ పార్టీకే బలం అధికంగా ఉందన్నారు. ఓయూ విద్యార్థులను కొన్ని పక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. అన్ని ఆలోచించే అభ్యర్థులను బరిలోకి దించామని జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఎవరికి టికెట్ ఇవ్వాలో కేసీఆర్‌కు బాగా తెలుసున్నారు. -
75 మంది లేకుంటే మూతే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కనీసంగా 75 మంది విద్యార్థులు ఉండాల్సిందే. ఇకపై అలాంటి స్కూళ్లనే కొనసాగిస్తారు. లేదంటే ఆ స్కూళ్లను మూసివేసి, వాటిలోని పిల్లలను పక్క స్కూళ్లకు పంపిస్తారు. ఇంగ్లిషు మీడియం సక్సెస్ స్కూళ్లకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇక ప్రాథమిక పాఠశాలల్లో కనీసంగా 20 మంది ఉండాల్సిందే. లేకపోతే వాటిని మూసివేస్తారు. ఇదీ ప్రధానంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా తీసుకోబోతున్న కీలక నిర్ణయం. విద్యార్థులు ఉన్న స్కూళ్లకే ఉపాధ్యాయులను పంపించే హేతుబద్దీకరణ విధానంపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. మార్గదర్శకాలను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి చేరిన ఈ ఫైలుకు ఆమోద ముద్ర పడగానే మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ఇందులో పలు కీలకమైన సిఫారసులు ఉన్నాయి. ప్రస్తుతం 10 వుంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలోనూ అనేకచోట్ల నలుగురు చొప్పున టీచర్లు ఉన్నారు. ఇందుకు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ప్రాథమికోన్నత పాఠశాలే ఉదాహరణ. ఇలాంటి స్కూళ్లు చాలా ఉన్నాయి. ఒక్క విద్యార్థి లేకపోయినా ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నట్లు అంచనా. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రూపొందించిన మార్గదర్శకాల మేరకు టీచర్ల హేతుబద్దీకరణ చేపట్టనున్నారు. దసరా సెలవుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఖాళీలను గుర్తించి టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు. ఇవీ మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలు! హాఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే విద్యార్థులు తక్కువగా ఉంటే అందులోని టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. విద్యార్థులను సమీపంలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. ఇప్పటి వరకు సక్సెస్ స్కూళ్లలో 20 మంది విద్యార్థులు ఉన్నా స్కూల్‌ను కొనసాగిస్తున్నారు. ఇకపై అలా ఉండదు. అందులోనూ 75 మంది ఉంటేనే కొనసాగిస్తారు. ప్రస్తుతం ఒక స్కూల్లో కనీసం 280 మంది విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయునితోపాటు అన్ని సబ్జెక్టులకు టీచర్లను ఇచ్చారు. ఆ తరువాత ప్రతి 30 మందికి అదనంగా ఒక సబ్జెక్టు టీచర్‌ను ఇచ్చారు. ఇపుడు ఆ సంఖ్యను 230కి కుదించారు. ఆ సంఖ్య దాటిన తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు అదనంగా టీచర్‌ను కేటాయిస్తారు. ఇది వరకు ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది లోపు ఎంత మంది విద్యార్థులున్నా ఆ స్కూల్‌కు ఒక టీచర్‌ను ఇచ్చే వారు. ఇపుడు వాటికి టీచర్‌ను ఇవ్వరు. ఆ స్కూల్లో కనీసంగా 20 మంది విద్యార్థులు ఉంటేనే టీచర్‌ను ఇస్తారు. దానిని కొనసాగిస్తారు. లేదంటే సమీపంలోని స్కూళ్లోకి ఆ విద్యార్థులను పంపిస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలలోని 6, 7 తరగతుల్లో తరగతికీ 20 మంది చొప్పున మొత్తం 40 మంది పిల్లలు ఉంటేనే దానిని కొనసాగిస్తారు. లేదంటే వాటిని మూసివేసి పిల్లలను సమీపంలోని స్కూల్‌కు పంపిస్తారు. టీచర్లను విద్యార్థులు ఉన్న స్కూళ్లకు బదిలీ చేస్తారు. ఒక స్కూల్లోని టీచర్లలో సర్వీసులో సీనియర్ అయిన టీచర్ తాను వెళ్లాలనుకుంటేనే బదిలీ చేస్తారు. ఇక అందరిలో తక్కువ సీనియారిటీ గల టీచర్‌ను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.