సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కనీసంగా 75 మంది విద్యార్థులు ఉండాల్సిందే. ఇకపై అలాంటి స్కూళ్లనే కొనసాగిస్తారు. లేదంటే ఆ స్కూళ్లను మూసివేసి, వాటిలోని పిల్లలను పక్క స్కూళ్లకు పంపిస్తారు. ఇంగ్లిషు మీడియం సక్సెస్ స్కూళ్లకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇక ప్రాథమిక పాఠశాలల్లో కనీసంగా 20 మంది ఉండాల్సిందే.
లేకపోతే వాటిని మూసివేస్తారు. ఇదీ ప్రధానంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణలో భాగంగా తీసుకోబోతున్న కీలక నిర్ణయం. విద్యార్థులు ఉన్న స్కూళ్లకే ఉపాధ్యాయులను పంపించే హేతుబద్దీకరణ విధానంపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. మార్గదర్శకాలను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించింది. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి చేరిన ఈ ఫైలుకు ఆమోద ముద్ర పడగానే మార్గదర్శకాలు జారీ కానున్నాయి.
ఇందులో పలు కీలకమైన సిఫారసులు ఉన్నాయి. ప్రస్తుతం 10 వుంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలోనూ అనేకచోట్ల నలుగురు చొప్పున టీచర్లు ఉన్నారు. ఇందుకు మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులోని ప్రాథమికోన్నత పాఠశాలే ఉదాహరణ. ఇలాంటి స్కూళ్లు చాలా ఉన్నాయి. ఒక్క విద్యార్థి లేకపోయినా ఇద్దరు, ముగ్గురు టీచర్లు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నట్లు అంచనా. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాజాగా రూపొందించిన మార్గదర్శకాల మేరకు టీచర్ల హేతుబద్దీకరణ చేపట్టనున్నారు. దసరా సెలవుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఖాళీలను గుర్తించి టీచర్ల బదిలీలను చేపట్టనున్నారు.
ఇవీ మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలు!
హాఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే విద్యార్థులు తక్కువగా ఉంటే అందులోని టీచర్లను విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్లకు పంపుతారు. విద్యార్థులను సమీపంలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.
ఇప్పటి వరకు సక్సెస్ స్కూళ్లలో 20 మంది విద్యార్థులు ఉన్నా స్కూల్‌ను కొనసాగిస్తున్నారు. ఇకపై అలా ఉండదు. అందులోనూ 75 మంది ఉంటేనే కొనసాగిస్తారు.
ప్రస్తుతం ఒక స్కూల్లో కనీసం 280 మంది విద్యార్థులు ఉంటే ప్రధానోపాధ్యాయునితోపాటు అన్ని సబ్జెక్టులకు టీచర్లను ఇచ్చారు. ఆ తరువాత ప్రతి 30 మందికి అదనంగా ఒక సబ్జెక్టు టీచర్‌ను ఇచ్చారు. ఇపుడు ఆ సంఖ్యను 230కి కుదించారు. ఆ సంఖ్య దాటిన తరువాత ప్రతి 30 మంది విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు అదనంగా టీచర్‌ను కేటాయిస్తారు.
ఇది వరకు ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది లోపు ఎంత మంది విద్యార్థులున్నా ఆ స్కూల్‌కు ఒక టీచర్‌ను ఇచ్చే వారు. ఇపుడు వాటికి టీచర్‌ను ఇవ్వరు. ఆ స్కూల్లో కనీసంగా 20 మంది విద్యార్థులు ఉంటేనే టీచర్‌ను ఇస్తారు. దానిని కొనసాగిస్తారు. లేదంటే సమీపంలోని స్కూళ్లోకి ఆ విద్యార్థులను పంపిస్తారు.
ప్రాథమికోన్నత పాఠశాలలోని 6, 7 తరగతుల్లో తరగతికీ 20 మంది చొప్పున మొత్తం 40 మంది పిల్లలు ఉంటేనే దానిని కొనసాగిస్తారు. లేదంటే వాటిని మూసివేసి పిల్లలను సమీపంలోని స్కూల్‌కు పంపిస్తారు. టీచర్లను విద్యార్థులు ఉన్న స్కూళ్లకు బదిలీ చేస్తారు.
ఒక స్కూల్లోని టీచర్లలో సర్వీసులో సీనియర్ అయిన టీచర్ తాను వెళ్లాలనుకుంటేనే బదిలీ చేస్తారు. ఇక అందరిలో తక్కువ సీనియారిటీ గల టీచర్‌ను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
75 మంది లేకుంటే మూతే!
Published Sun, Sep 14 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement