
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి రాష్ట్ర ప్రజల కు విజ్ఞప్తి చేశారు. టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలోని 45శాతం వినియోగదారులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నారని, గత మార్చిలో 55 శాతం వినియోగదారులు ఆన్‌లైన్‌లోనే చెల్లించారన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఆయన హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు.
విద్యుత్ బిల్లుల చెల్లింపు గడువు పొడిగించి మూతపడిన పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు ఉపశమనం కల్పించే అంశంపై విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకోలేవని, కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇంటింటికి వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు జారీ చేస్తే కరోనా వ్యాప్తికి అవకాశాలుంటాయని, ప్రత్యామ్నాయంగా ఈఆర్‌సీ అనుమతితో తాత్కాలిక బిల్లులను ప్రస్తుత ఏప్రిల్ లో వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో జారీ చేశామని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో జారీ చేసిన బిల్లులకు సమానంగా ఈ ఏప్రిల్‌లో బిల్లులు జారీ చేశామన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత రెండు నెలల కాలానికి మీటర్ రీడింగ్ తీసి ఏప్రిల్, మే నెలలకు చెరి సగం చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్‌లో వినియోగదారులు చెల్లించిన బిల్లుల్లోని హెచ్చుతగ్గులు సర్దుబాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment