గురువారం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో తంగేడు వనం పార్కులో కలియతిరుగుతున్న మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు
చౌటుప్పల్: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన మాదిరిగానే సీఎం కేసీఆర్ హరిత ఉద్యమాన్ని సైతం విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో రూ.3.45 కోట్ల వ్యయంతో నిర్మించిన తంగేడువనం పార్కును మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) విధానంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మంత్రులు పార్కు అంతా కలియతిరిగారు. అలాగే ధర్మోజిగూడెంలోని లక్కారం –1 బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్–విజయ వాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నాటిన విధంగానే గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట సైతం మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.శోభ, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, కలెక్టర్ అనితారామచంద్రన్, అటవీశాఖ సీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment