రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అయినా ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలతో ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అని, అందుకే ఆ పార్టీ నేతలు నోటికొచ్చిన హామీలిస్తున్నారని విమర్శించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలసి జూపల్లి విలేకరులతో మాట్లాడారు.
పింఛన్లు, మహిళా సంఘాలకు రుణాలు, అభయహస్తం, సెర్ప్ ఉద్యోగుల విషయంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను జూపల్లి ఖండించారు. తెలంగాణ రాకముందు రాష్ట్రవ్యాప్తంగా రూ. 835.64 కోట్ల పింఛన్లు ఇస్తే, తాము ఏటా రూ. 5,301.83 కోట్ల ఆసరా పింఛన్లుగా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే 1998–2014 మధ్య మహిళా సంఘాలకు రూ. 16 వేల కోట్ల రుణాలు అందగా గత మూడున్నరేళ్లలోనే తాము రూ. 22,301 కోట్ల రుణాలిచ్చామన్నారు. దీనికి అదనంగా రూ. 4,555 కోట్లను స్త్రీనిధి ద్వారా అందించామని చెప్పారు.
అభయహస్తం కింద లబ్ధి పొందేవారిలో 1,16,848 మందికి ఆసరా కింద పింఛన్లు ఇస్తున్నామని, వారి కోసం ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. వారి ద్వారా కట్ చేసుకునే బీమా మొత్తాన్ని తీసుకోవడం లేదని, అయినా సహజ మరణం పొందితే రూ. 75 వేలు, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 4 లక్షలు అందేలా రాష్ట్రంలోని 78 లక్షల మందికి వర్తింపజేసే పథకాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని జూపల్లి చెప్పారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలను గణనీయంగా పెంచిన ఘనత తమదేనన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలు అర్థం చేసుకోవాలని, మేనిఫెస్టోలో ఇస్తామని చెప్పకుండానే తాము ఇస్తున్నామని, అదే కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు.
పింఛన్లలో జాప్యం నిజమే...
రిజర్వు బ్యాంకు నుంచి రాష్ట్రానికి నగదు రావడంలో సమన్య వచ్చినందున గత నెలలో పింఛన్ల విషయంలో ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి జూపల్లి తెలిపారు. అలాగే అభయహస్తం పింఛన్ల కింద 2017 ఫిబ్రవరి నుంచి బకాయి ఉన్నమాట కూడా నిజమేనని చెప్పారు. ఉపాధి హామీ వేతనాల కోసం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సరిగా రావడం లేదని, అయినా రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసి ఇస్తున్నామని, అందుకే కొంత జాప్యం జరుగుతోందన్నారు. ఏదిఏమైనా పథకాల అమల్లో ఉన్న ఇబ్బందులు తొలగించుకుని ముందుకెళుతున్న తమను విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment