సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్. చిత్రంలో ఎంపీ బూర, ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. మంత్రి జగదీశ్‌రెడ్డి, కర్నె తదితరులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: ‘జానారెడ్డి నీతులు చెప్పుడు మానుకోవాలి. అడ్డం పొడుగు మాట్లాడే నేతలను, అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించే నాయకులను మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? నల్లగొండలో జరిగిన హత్య విషయంలో మీపార్టీ నాయకుడు.. మొండాలు మురికి కాల్వల్లో తేలాలన్నడు. పక్కనే కూర్చున్న జానా ఏం చేశారు. మాకు నీతులు చెప్పడం మానేయండి..’అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు హితవు పలికారు.
నల్లగొండ జిల్లా చండూరులో సోమవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజకవర్గ ప్రగతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘నల్ల గొండకు ఫ్లోరోసిస్ శాపం ఎవరి వల్ల వచ్చింది? 1956లో ఏపీలో తెలంగాణ కలవక ముందు ఇక్కడ ఫ్లోరోసిస్ సమస్య లేదు. 50 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఫ్లోరోసిస్ సమస్య ఉత్పన్నం అయింది. వారి ఆస్తులు పెరిగాయి.. ఆకారాలు పెరిగాయి.. అహంకారం పెరిగింది.. అదే స్థాయిలో నీటిలో ఫ్లోరోరైడ్ పెరిగింది’ అని దుయ్యబట్టారు. జిల్లాలో 2 లక్షల మంది ఫ్లోరైడ్ బా«ధితులుగా మారడానికి కాంగ్రెసే కారణమని, జిల్లాను ఆ పార్టీ నేతలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నేతలకు మానసిక ఆందోళన
‘టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దిగజారి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో మైక్ విరగొట్టి, హెడ్‌ఫోన్లు విసిరి కొట్టారు. గతంలో టీఆర్‌ఎస్ ఇలా దాడి చేయలేదా అని సమర్థించుకుంటున్నారు. అధికారం కోసం వారు మానసిక ఆందోళన చెందుతున్నారు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏం తక్కువ చేసిందో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పాలన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోమన్నప్పుడు ఎవరన్నా నిలదీశారా? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే బతుకంతా చీకటి అయితదని శాపాలు పెడితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కరన్నా మాట్లాడారా? అని కేటీఆర్ నిలదీశారు.
ఎందుకు తిరుగుతున్నరు?
2004లో కరెంటు కోసం పోరాడిన వారిని నాటి టీడీపీ పాలకులు కాల్చి చంపితే, ముదిగొండలో కాంగ్రెస్ పాలకులు రైతులను కాల్చి చంపారని కేటీఆర్ ఆరోపించారు. ‘ఇపుడు రైతును రాజును చేస్తామని అంటున్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో విత్తనాలు, ఎరువులు, కరెంటు కోసం రైతులు ఆందోళనలు చేసేవారు. ఇపుడు కరెంటు వద్దని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది కేసీఆర్ గొప్ప కాదా? రైతుల సాగు పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4వేలు ఇవ్వడం దేశంలో కేసీఆర్ తప్ప మరొకరు ఆలోచన చేశారా? కాంగ్రెస్ ఎందుకు సర్కస్ ఫీట్లు చేస్తోంది. తిన్నది అరగక తిరుగుతున్నరు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించడం కాంగ్రెస్‌కు కడుపు మంటగా ఉంది’ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు ఆడపిల్లల బాధ్యత గురించి తెలుసు కాబట్టే కల్యాణలక్ష్మి పేర రూ.75,116 ఇస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment