
సాక్షి, న్యూఢిల్లీ : ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం మూలనపడేయడానికి కారణాలు ఏమిటని, అసలు ఈ బిల్లు పట్ల ప్రభుత్వ దృక్పథం ఏమిటని, రాజ్య సభలోఇప్పటికీ ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదం పొందడానికి ఉన్న ఆటంకం ఏమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.
చట్ట సభల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108వ రాజ్యాంగ బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఆ బిల్లు 15వ లోక్ సభ ఆమోదం పొందకుండా పెండింగ్‌లో ఉండిపోయిందని.15వ లోక్ సభ రద్దు కావడంతో బిల్లు కాలపరిమితి కూడా దాటిపోయిందని వివరించారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే ఈ బిల్లు ఆమోదం చేపట్టే రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment