
సాక్షి, మహబూబాబాద్ : గిరిజన మహిళైన తనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గొప్ప అవకాశం కల్పించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్‌కు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన డోర్నకల్ గడ్డ అభివృద్ధికి పాటుపడతానన్నారు. పెద్ద ఎత్తున స్వాగతం పలికిన పార్టీ శ్రేణులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభివృద్ధికి ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
మూడువేలకు పైగా తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, తమ తండాలో తమ రాజ్యాన్ని అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని, ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు త్వరలో ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్తానన్నారు. మాజీ మంత్రి రెడ్యానాయక్‌తో కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని అన్నారు.