సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా నేతల తరహాలో మాట్లాడుతున్నారని, సెక్షన్ 8పై వారు చేసిన వ్యాఖ్యల ద్వారా నిజ స్వరూపం బట్టబయలైందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వంపై రాజీ పడేది లేదని, ఎవరైనా సెక్షన్ 8 గురించి మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణపై ఇతరుల పెత్తనం సహించేది లేదని, బానిస తెలంగాణను అనుమతించేది లేదన్నారు. పరాయి మనస్తత్వ బానిస నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడతామని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఏనాడూ తెలంగాణ కోసం పోరాడలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల వల్లే తెలంగాణ ఏడు మండలాలను కోల్పోయిందని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
రాష్ట్రానికి ద్రోహంచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ
తెలంగాణపై విషం చిమ్మడమే పనిగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధిని హర్షిస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ మాత్రం సొంత రాష్ట్రానికి ద్రోహం చేయడమే విధానంగా పెట్టుకున్నాయన్నారు. బుధవారం అసెంబ్లీలోని టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సచివాలయంపై కోర్టు తీర్పుకోసం ఏడాది పాటు ఎదురుచూశామని, సచివాలయ నిర్మాణం వద్దనే వారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లేనని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సచివాలయంతో ప్రజాధనం వృధా కాదని, రాష్ట్రానికి కొత్త సచివాలయం తలమానికంగా నిలుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment