
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాధ్ కేబినెట్‌లోని ఓ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువు చెప్పించకపోతే వారిని జైలుకు పంపుతానంటూ ప్రకటించారు. ఈ మేరకు అవరసమైన చట్టాన్ని కూడా రూపొందించేందుకు సిద్ధమంటూ ఆయన చెప్పుకొచ్చారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ ఆదివారం సాయంత్రం బల్లియాలో జరిగిన ఓ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ముందు ఆరు నెలలు మిమల్ని(తల్లిదండ్రులను ఉద్దేశించి) బతిమాలుతా. ఆ తర్వాత నా చట్టం ప్రకారం ముందుకెళ్తా. ఎవరైతే తమ పిల్లల్ని స్కూల్‌కి పంపించరో వారు జైలుకు వెళ్లాల్సిందే. ఐదు రోజలపాటు తిండి తిప్పలు లేకుండా వారి కడుపు మాడేలా చేస్తా. అంటూ రాజ్‌భర్ ప్రసంగించారు. పైగా లంకకు వారధి కట్టేందుకు సహకరించాలని రాముడు ఎలాగైతే సముద్రుడిని బెదిరించాడో.. పిల్లలను బడిలో చూడాలన్న లక్ష్యం కోసం తానూ ఎంతకైనా సిద్ధమేనంటూ మరో వ్యాఖ్య చేశారు. తాను మాట్లాడింది తప్పని భావిస్తే తల నరకండంటూ రాజ్‌భర్ చెప్పుకొచ్చారు.
కాగా, సుహెల్‌దేవ్ సమాజ్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో రాజ్‌భర్ ఒకరు. బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న ఎస్‌ఎస్‌పీ తరపు నుంచి రాజ్‌భర్‌కు మంత్రి పదవి దక్కింది. కొన్ని రోజల క్రితం ఘజిపూర్ జిల్లా న్యాయమూర్తి(కలెక్టర్) సంజయ్ కుమార్ తన మాట వినటం లేదని ఆరోపిస్తూ తక్షణమే బదిలీ చేయాలని, లేకపోతే తాను ప్రభుత్వం నుంచి వైదొలుగుతానని రాజ్‌భర్ హెచ్చరించారు. వెంటనే రంగంలోకి దిగిన సీఎం ఆదిత్యానాథ్.. రాజ్‌భర్-సంజయ్‌లతో చర్చించి సమస్యను పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment