ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు.
జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment