సాక్షి, చెన్నై : తమిళనాడులో ప్రధాన విపక్షం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ ఎన్నికయ్యారని మంగళవారం జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు.స్టాలిన్ (65) ఇప్పటివరకూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించారు. తన తండ్రి, పార్టీ అధ్యక్షుడు ఎం కరుణానిధి ఈనెల 7న మరణించడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. పార్టీ అధ్యక్ష పదవికి 65 మంది జిల్లా కార్యదర్శులు ప్రతిపాదించగా స్టాలిన్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు తనను పార్టీలోకి తిరిగి తీసుకోని పక్షంలో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని కరుణానిధిచే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి హెచ్చరించారు. పార్టీని నడిపించే సమర్ధత స్టాలిన్‌కు లేదని విమర్శించారు. తన తండ్రికి శ్రద్ధాంజలి ఘటించేందుకు అళగిరి సెప్టెంబర్ 5న మౌన ర్యాలీ చేపట్టనున్నారు. కరుణానిధి మరణం నేపథ్యంలో పార్టీ శ్రేణుల నుంచి తిరుగులేని మద్దతుతో తాను అధ్యక్ష పగ్గాలు చేపడుతున్నానని అళగిరి వ్యాఖ్యలకు స్టాలిన్ దీటుగా బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment