సాక్షి, చెన్నై: దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. దేశ జీడీపీ 5శాతానికి పడిపోవడంపై ఎన్‌డీఏ సర్కార్‌ను డీఎంకే తీవ్రంగా దుయ్యబట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5 శాతానికి పడిపోవడం చాలా ఆందోళనకరమైందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ బుధవారం విమర్శించారు. గత 27 ఏళ్లలో ఇంత బలహీనమైన జీడీపీ వృద్ధి గణాంకాలను చూడలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భయంకరమైన' ఆర్థిక మందగమనాన్ని దాచిపెట్టడానికే కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అరెస్ట్‌లాంటి అంశాలను కేంద్రం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఆర్థిక మందగమనాన్ని కప్పిపుచ్చే ప్రణాళికలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. అయితే దీనికి సంబంధించి మీడియాలో వార్తలు రాకుండా నిరోధించినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై సోషల్ మీడియాలో విరివిగా వార్తలొచ్చాయని స్టాలిన్ పేర్కొన్నారు.
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రుల మూడు దేశాల పర్యటనపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఇది టూరింగ్ కేబినెట్ అనివ్యాఖ్యానించారు. 2015, 2019 సంవత్సరాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ను ఏఐడీఎంకే ప్రభుత్వం నిర్వహించిందని గుర్తుచేసిన ఆయన పెట్టుబడులు, ఉద్యోగాలపై పళని ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పళని స్వామి బృందం ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు అమెరికా, బ్రిటన్ సహా మూడుదేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment