తమిళనాడులో వారసుడు వచ్చేశాడు
తమిళనాడులో వారసుడు వచ్చేశాడు
Published Thu, Oct 20 2016 6:18 PM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
తమిళనాడులో ఇన్నాళ్లుగా నలుగుతున్న వారసత్వ పోరు ఓ కొలిక్కి వచ్చింది. తన తర్వాత రాజకీయ వారసుడిగా ఎంకే స్టాలిన్ (63) ఉంటాడని డీఎంకే అధినేత కరుణానిధి (92) ప్రకటించారు. అయితే తాను మాత్రం ఇప్పట్లో రాజకీయాల నుంచి రిటైరయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దాంతో ఇన్నాళ్లుగా సోదరులు అళగిరి, స్టాలిన్ మధ్య ఉందనుకున్న వారసత్వ పోరుకు తెరపడినట్లయింది. స్టాలినే తన రాజకీయ వారసుడని ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరుణానిధి తెలిపారు. అయితే తాను అళగిరిని మాత్రం మిస్ కావడం లేదని కూడా స్పష్టం చేశారు.
కరుణానిధి తర్వాత డీఎంకే ఆధిపత్యం కోసం అళగిరి, స్టాలిన్ మధ్య చాలాకాలంగా పోరు ఉంది. కరుణానిధి మద్దతు స్టాలిన్‌కే ఉందని తెలియడంతో.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన తమిళనాడు ఎన్నికల్లో.. డీఎంకే తరఫున ప్రచారం చేయకూడదని కూడా అళగిరి నిర్ణయించుకున్నారు. రిటైర్మెంట్ గురించి కరుణను ప్రశ్నించగా.. ''కరుణానిధి రిటైర్మెంట్ ఇస్తారని చెప్పి విషయాలను సంక్లిష్టం చేయొద్దు. నేను ఇప్పటికిప్పుడే రిటైరైపోయి.. పగ్గాలను స్టాలిన్‌కు ఇచ్చే సమస్య లేదు'' అని చెప్పారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణలో స్టాలిన్ తనకు చాలా సహాయంగా ఉంటున్నాడని, అతడు యువకుడిగా ఉన్నప్పుడు కూడా గోపాలపురం యూత్ సెంటర్‌ను ఏర్పాటుచేసి.. బాగా కష్టపడ్డాడని, మీసా చట్టం కింద అరెస్టయినప్పుడు చిత్రహింసలకు గురయ్యాడని కరుణానిధి తెలిపారు. అతడి కృషివల్లే ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చిందని అన్నారు.
స్టాలిన్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల డీఎంకే సీనియర్ నాయకుడు టీకేఎస్ ఇళంగోవన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. అతడికి అధికార దాహం ఏమీ లేదని.. తన సొంత కృషితో పార్టీలో ఈ స్థానానికి చేరుకున్నాడని ఆయన తెలిపారు.
Advertisement