డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్
చెన్నై: ఊహించిందే జరిగింది. 48 ఏళ్ల తర్వాత డీఎంకే కొత్త నాయకుడిని ఎన్నుకుంది. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ బాధ్యతలు చేపట్టారు. బుధవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తూ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప‍్రతిపక్ష నేతగా, పార్టీ కోశాధికారిగా స్టాలిన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సర్వసభ్య సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ తనకు పదవి ముఖ్యం కాదని, పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రధానమన్నారు. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ‍్ఞతలు తెలిపారు. మరోవైపు డీఎంకే రాజ్యసభ సభ్యురాలు, కరుణానిధి ముద్దుల కూతురు కనిమొళి, పెద్దకుమారుడు అళగిరి కూడా సర్వసభ్య సమావేశానికి గైర్హాజరు అయ్యారు. ఈ సమావేశంలో అళగిరి సస్పెన్షన్ వేటు ఎత్తివేసే అంశం కూడా ప్రస్తావనకు రాలేదు.
ఇక డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి 93 ఏళ్ల వృద్ధాప్యంతో బాధ పడుతున్నారు. అందుకే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతను స్టాలినే మోశారు. తన రాజకీయ వారసుడు అయ్యే లక్షణాలు స్టాలిన్‌కు ఉన్నాయంటూ కరుణానిధి ఇప్పటికే అనేక సార్లు అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కరుణానిధి ఎమ్మెల్యేగా గెలిచినా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాను స్టాలిన్‌కే కట్టబెట్టారు.
అయితే వారసుడు స్టాలినే అని ఇంత వరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఇటీవలి కాలంలో కరుణానిధి పదే పదే అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి లేకుండానే డీఎంకే సర్వసభ్య సమావేశం ముగిసింది. అస్వస్థత కారణంగా ఆయన ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.