సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్ష పదవికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్ ఆదివారం నామినేషన్ వేశారు. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. అదే రోజు పార్టీ ప్రధాన కార్యదర్శి, మిగిలిన కార్యవర్గాన్ని కూడా ప్రకటించనున్నారు. కాగా నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధి స్మారక స్థలాన్ని సందర్శించారు.
డీఎంకే అధ్యక్షుడుగా దాదాపు ఐదు దశాబ్దాలపాటు కొనసాగిన కరుణానిధి ఇటీవల కన్నుమూయడంతో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌ను గతంలోనే తన రాజకీయ వారసుడిగా కరుణానిధి ప్రకటించారు. కాగా, కరుణానిధి మరణానంతరం పార్టీపై ఆధిపత్యం కోసం స్టాలిన్ సోదరుడు అళగరి సైతం తాజాగా పావులు కదుపుతున్నారు. కరుణానిధి ఉన్నప్పుడే డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన అళగిరి ఎలాగైనా తిరిగి పార్టీలోకి రావాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి అది అంత తేలికైన విషయం కాదని స్టాలిన్ మద్దతుదారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment