ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తా.. | MLA Jaleel Khan Fires On Women Corporator In ViJayawada | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 7:41 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

MLA Jaleel Khan Fires On Women Corporator In ViJayawada - Sakshi

సాక్షి, వించిపేట (విజయవాడ పశ్చిమ): వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌.. మహిళా కార్పొరేటర్‌పై దౌర్జన్యానికి దిగారు. ప్రొటోకాల్‌ ప్రకారం డివిజన్‌లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యేనో, ఆ డివిజన్‌ కార్పొరేటరో ప్రారంభించాల్సి ఉండగా, మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ వెంట తీసుకొచ్చి వారిచేత ప్రారంభింపజేశారు. దీనిపై నిలదీసిన మైనార్టీ మహిళా కార్పొరేటర్‌పై జలీల్‌ఖాన్‌ దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. 

విజయవాడ 36వ డివిజన్‌ పరిధిలోని వించిపేట నైజాంగేటు సెంటర్‌లో రూ.30 లక్షలతో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ ప్రొటోకాల్‌ పాటించకుండా మైనార్టీ కార్పొరేటర్‌ జాన్‌బీ పక్కనుండగానే ఆయన అనుచరులైన మరో డివిజన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తల చేత కొబ్బరికాయలు కొట్టించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేటర్‌ జాన్‌బీ అడ్డుకుని ప్రొటోకాల్‌పై నిలదీశారు. 

దీంతో కోపోద్రిక్తుడైన జలీల్‌ఖాన్‌ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, అడగడానికి నువ్వెవరు.. నా కాళ్లు పట్టుకుంటే నీకు సీటు ఇప్పించా.. ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తానంటూ.. ఆమెపై దాడికి యత్నించారు. తనకు తెలియకుండా డివిజన్‌లో అభివృద్ధి పనులు జరగొద్దని అధికారులకు హుకుం జారీచేశారు. 

జాన్‌బీ మాట్లాడుతూ.. ఓట్లు వేసే వారికి మీరు పని చేయరా? ఓ ఎమ్మెల్యే మాట్లాడే మాటలా ఇవి? ప్రజలు చూస్తున్నారు. ఆడవారితో మాట్లాడే పద్ధతి ఇదా? మీ ఇంటికి చేస్తున్నావా? మా ఇంటికి చేస్తున్నావా?.. అంటూ జలీల్‌ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర నుంచి వించిపేట నైజాంగేటు సెంటర్‌ నుంచి ఫోర్‌మెన్‌ బంగ్లా వరకు రోడ్లు గోతులుపడిపోయి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, దీనిపై అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగానన్నారు. 

కౌన్సిల్‌లో ప్రతిపాదనలు పెట్టడంతో నగరపాలక సంస్థ ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభించామన్నారు. 36వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉనికిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే.. డివిజన్‌లో అభివృద్ధి పనులు చెయ్యొద్దంటూ అధికారులను ఆదేశించడం నీచమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని త్వరలో ప్రభుత్వానికి, ఆ నాయకులకు తగిన బుద్ధి చెబుతారన్నారు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement