సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కొనుగోలుచేస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బండారం బట్టబయలైంది. ఇటీవల పార్టీ మారిన గిడ్డి ఈశ్వరితో చంద్రబాబు కుదుర్చుకున్న భారీ డీల్ గుట్టు రట్టయింది. మంత్రి పదవి లేదా ఎస్టీ కార్పొరేషన్ పదవి ఇస్తామని ఆశజూపి.. ఆమెను పార్టీలోకి తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ మేరకు స్వయంగా డీల్ గురించి గిడ్డి ఈశ్వరే వెల్లడించారు. ఈ మేరకు కార్యకర్తలతో ఆమె మాట్లాడుతున్న వీడియో ‘సాక్షి’కి చిక్కింది. చంద్రబాబు ఆఫర్‌ను అనుచరులకు వెల్లడించిన గిడ్డి ఈశ్వరి.. ఆఫర్ బాగుందని, వెళ్లకతప్పదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అంటే ఇష్టం లేకపోయినా మనకు పదవి కావాలంటూ ఆమె వెల్లడించారు. అన్ని పనుల్లో కమీషన్లు కూడా వస్తాయని ఆమె అన్నారు.
అధికార టీడీపీ నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి పదవుల ఎరవేసి.. మరికొందరికి డబ్బు ఆశ జూపి.. కాంట్రాక్టుల్లో కమీషన్ల ప్రలోభాలు చూపి.. టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకొని.. తమ పార్టీలో చేర్చుకుంటుందన్న మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజాగా గిడ్డి ఈశ్వరి వ్యవహారంలో ‘సాక్షి’ చేతికి వీడియో సాక్ష్యం చిక్కింది. టీడీపీ నేతల ప్రలోభాల గుట్టు రట్టయింది.
ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పవాణి తీవ్రంగా స్పందించారు. గిడ్డి ఈశ్వరి వీడియోతో చంద్రబాబు బండారం బయటపడిందని ఆమె అన్నారు. సీఎం హోదాలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు అని ఆమె మండిపడ్డారు. ఇన్నాళ్లు తాము ఏదైతే చెప్పామో.. అదే ఈ వీడియోతో నిజమైందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభ పెడుతున్నారని స్పష్టమైందని అన్నారు. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నారని గతంలో పేర్కొన్న చంద్రబాబే ఇప్పుడా పని చేస్తున్నారని విమర్శించారు. తాజా వీడియోతో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment