దీక్ష విరమింపజేస్తున్న మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజద్‌బాషా
కడప కార్పొరేషన్: తెలుగుదేశం పార్టీకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని నిరసిస్తూ వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో కడపలోని అంబేడ్కర్ సర్కిల్‌లో చేపట్టిన 48 గంటల నిరుద్యోగ దీక్ష గురువారం ఉదయం ముగిసింది. నగర మేయర్ కె. సురేష్‌బాబు, కడప ఎమ్మెల్యే అంజద్‌బాషాలతో కలిసి రఘురామిరెడ్డి దీక్ష చేస్తున్న వారికి పండ్ల రసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి అంటూ ప్రభుత్వం నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోందన్నారు. కేవలం 5 శాతం మందే భృతికి అర్హులయ్యారని, మిగిలిన 95 శాతం మందికి రాలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల 8 నెలలైందని , ఇప్పటికి ఒక్కో నిరుద్యోగ అభ్యర్థికి నెలకు రెండువేల చొప్పున ప్రభుత్వం లక్షకు పైగా బాకీ ఉందన్నారు.
అదంతా ఇవ్వకుండా నాలుగు నెలల్లో ఎన్నికలొస్తున్నాయని, నాలుగువేలు ఇచ్చి ఓట్లు దండుకోవడానికే ఈ డ్రామా అడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు కుమారుడికి తప్ప మరెవరికీ ఉద్యోగం రాలేదన్నారు. రాజధానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని చెబుతున్నారని, వాస్తవానికి అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకొని మోదీకి అసెంబ్లీలో ధన్యవాదాలు తెలిపిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్నారు. ఈరోజు యూ టర్న్ తీసుకొని హోదా కావాలని చంద్రబాబు అడిగినాప్రజలు విశ్వసించరని తెలిపారు. 2014లో టీడీపీకి పవన్ అండ లేకపోయి ఉంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు రైతులు, మహిళలు, ఉపాధ్యాయులు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని, వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ ముఖ్య మంత్రి తాగే నీళ్ల బాటిల్ విలువ రూ.750 అని, ఇటీవల టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష సందర్భంగా తాగిన నీళ్ల బాటిల్ విలువ రూ.1500 అన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆ మాత్రం విలువ చేయవా అని ఆయన ప్రశ్నించారు. రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే యువత తిరగబడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు తుమ్మలకుంట శివశంకర్, నగ ర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, మాజీ అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్, ఎస్‌ఏ షంషీర్‌బాషా, నాయకులు మధువర్థన్‌రెడ్డి, కోటా శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment