సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న వారంతా రాజకీయంగా ఎంతో నష్టపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో చక్రం తిప్పానని చంద్రబాబు చెప్పుకున్న కాలంలో కూడా ఎవరూ బాగుపడింది లేదన్నారు. ప్రధానిగా పనిచేసిన గుజ్రాల్ ఆ తర్వాత రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నారని, ఆయన తర్వాత ప్రధాని అయిన దేవెగౌడ పరిస్థితీ అంతేనని చెప్పారు. అనంతరం బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాజ్‌పేయి కూడా రిటైర్డ్ అయ్యారని పేర్కొన్నారు.
ఇప్పుడేమో కాంగ్రెస్‌తో బాబు పొత్తుకు దిగారని, దీంతో చిన్న వయసులోనే రాహుల్ గాంధీ కూడా తెరమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. రాహుల్ గాంధీ గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయనపై చంద్రబాబు రాళ్లు వేయించారని, ఇప్పుడేమో కాంగ్రెస్‌ను తలపై పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కాంగ్రెస్‌తో కలిస్తే బట్టలు ఊడదీసి కొడతారన్న మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్‌లో టీడీపీ విలీనమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు.
హత్యాయత్నం కేసు నీరుగార్చేందుకు నాటకాలు
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును నీరుగార్చేందుకు సీఎం చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. హత్యాయత్నం ఉదంతంలో ఏ–1 ముద్దాయి ముమ్మాటికీ చంద్రబాబేనన్నారు. ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుండటంతో రాజకీయంగా ఆయన్ను ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హత్యాయత్నానికి ఉపయోగించింది కత్తి కాదు ఫోర్కు అని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొన్ని న్యూస్ ఛానెళ్లు ప్రచారం చేయడం దారుణమన్నారు. హత్యాయత్నం ఘటనపై సీబీఐ విచారణ జరపకుండా ఉండేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కీలక వ్యక్తుల కాళ్లను పట్టుకున్నారని ఆరోపించారు.
హత్యాయత్నం ఘటన జరిగిన రెండో రోజు నిందితుడి సోదరుడు తామంతా టీడీపీ అభిమానులం అని చెప్పారని, అయితే సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో ఆ కుటుంబమంతా వైఎస్సార్‌సీపీ అభిమానులంటూ ప్రచారం చేయించడం దారుణమని మండిపడ్డారు. ప్రత్యర్థులను హతమార్చడం బాబుకు అలవాటేనని ఆరోపించారు. ప్రతిపక్ష నేతను కడతేర్చేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి చివరకు ఫెయిల్ అయ్యారన్నారు. ఆపరేషన్ గరుడ గురించి ఓ చిన్నస్థాయి నటుడు శివాజీ మీడియాకు వివరాలిస్తే వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆపరేషన్ గరుడ చెప్పిన విధంగానే వరుస ఘటనలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ అధికారులను, డీజీపీని పక్కన కూర్చోబెట్టుకొని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు.
బాబుతో పొత్తంటే రాజకీయాల నుంచి రిటైర్మెంటే
Published Tue, Nov 6 2018 3:50 AM | Last Updated on Tue, Nov 6 2018 3:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment