
చిత్తూరు ఎడ్యుకేషన్: టీడీపీ నాయకులకు ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీలే ముఖ్యమని, కేంద్రంతో పోరాడే శక్తి లేక ప్రతి దానికీ రాజీపడిపోతున్నారని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. ఆమె ఆదివారం మధ్యాహ్నం చిత్తూరులోని కలెక్టర్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడారు.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి 16 రోజులవుతుంటే కలుగులో దాగున్న సీఎం అన్ని పార్టీలు పొగబెట్టిన తర్వాత బయటకొచ్చి రాజీలేని పోరాటం చేస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఇప్పటివరకు ఆయన కాని, ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులు ఎన్‌డీఏ నుంచి వైదొలుగుతామని ఎందుకు చెప్పలేకపోతోందని నిలదీశారు. ప్యాకేజీతో ఉపయోగం లేదని నాడే జగన్‌మోహన్‌రెడ్డి చెప్పాగుర్తుచేశారు. హోదా ఇవ్వకపోతే ఎంపీలు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని పవన్ 2016లో చెప్పి, ఇప్పుడు రాజీనామాలు ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు.