సాక్షి, అమరావతి: తిరుగులేని మెజారిటీతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. జగన్‌ను ప్రజలు ఎంత అభిమానిస్తున్నారనే దానికి తాజా ఎన్నికల ఫలితాలే తిరుగులేని నిదర్శనమన్నారు. వైఎస్సార్‌ఎల్పీ సమావేశానికి శనివారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై బాధ్యత కూడా చాలా పెరిగిందన్నారు. మొదటి సంవత్సరంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెప్పారని.. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా చెప్పలేదని గుర్తుచేశారు. తన తండ్రిలా రాష్ట్ర ప్రజలను ఆయన అభిమానించారని, ప్రజల కష్టాలు దూరం చేయాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారన్నారు.
ఇతర పార్టీల మద్దతు తీసుకోకుండా చంద్రబాబు పోటీ చేస్తే ఎలావుంటుందో ఈ ఎన్నికల్లో తేలిపోయిందన్నారు. ఆయన అనుభవం ఎంత శాతం ఉందో చంద్రబాబు వెనుకున్న ఎమ్మెల్యేలను చూస్తే తెలుస్తుందన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చే సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. తన మీద ఐరన్ లెగ్ ముద్ర వేసి వైఎస్ జగన్ నుంచి తనను దూరం చేయడానికి టీడీపీ నాయకులు చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. తిరుగులేని ఆధిక్యంతో జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, తనది గోల్డెన్ లెగ్ అని టీడీపీ నాయకులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment