
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేస్తుంటే, టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో వెన్నుచూపుతున్నారని ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు. ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తమ పార్టీ ఎంపీలకు రాష్ట్ర ప్రజలంతా సంఘీభావం తెలియజేస్తుంటే, టీడీపీ నాయకులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రోజా బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎంపీల ఆమరణ దీక్షను కొవ్వు తగ్గించుకునే కార్యక్రమం అనడానికి టీడీపీ నాయకులకు సిగ్గులేదా? అని మండిపడ్డారు. నాలుగేళ్లుగా ప్రజల సొమ్మును దోచుకు తిన్న టీడీపీ ఎంపీలు, మంత్రులే కొవ్వుకు బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు.
హోదా ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర:‘‘ప్రజల పక్షాన ఒంటరి పోరాటం సాగిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా నాటకాలాడడం, మాటలు మార్చడం మా పార్టీకి చేతకాదు. ప్రత్యేక హోదా కోసం రైల్‌రోకో చేపట్టిన మా పార్టీ నాయకులను, కార్యకర్తలను సివిల్ పోలీసులతో అరెస్టు చేయించడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడం, సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలపడం ద్వారా చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తెలుగు ద్రోహిగా మిగిలిపోయారు. ’’ అని రోజా మండిపడ్డారు.‘‘విశ్వవిఖ్యాత పప్పు సార్వభౌమ నారా లోకేశ్‌కు సూట్‌కేసు ఇస్తేగానీ ఫైల్‌పై సంతకం కావడం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికీ రానన్ని నిధులు మన రాష్ట్రానికి వచ్చాయని చంద్రబాబు గతంలో పేర్కొన్నారు. ఆ నిధులన్నీ ఎక్కడ దాచారో చెప్పాలి. ?’’ అని రోజా నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment