బెంగళూరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, ప్రజలతో పాటు, పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం కుమారస్వామి శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..దేశానికి తనకు తాను రక్షకుడుగా మోదీ చెప్పుకుంటునే మరోవైపు తనవారిని రక్షించుకునేందుకు అవినీతిని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తాలని కుమారస్వామి ఈ సందర్భంగా విపక్ష పార్టీలను కోరారు. ప‍్రధానమంత్రి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా.. సమాఖ్య వ్యవస్థను దెబ్బదీసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటిపై రుజువులతో సహా నిరూపిస్తామన్నారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేలను బీజేపీ లాక్కునేందుకు చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అయిదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అజ‍్ఞాతంలో ఉన్నారన్నారు. అలాగే బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే, బల నిరూపణ చేసుకుంటామని కుమారస్వామి స్పష్టం చేశారు.
విప్ జారీ చేసిన జేడీఎస్, కాంగ్రెస్
బడ్జెట్ సందర్భంగా జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశాయి. కాంగ్రెస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం, అసంతృప్తులకు బీజేపీ గాలయం వేస్తోందని ఆరోపణలతో రెండు పార్టీల పెద్దలు అప్రమత్తమయ్యారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు తప్పక హాజరు కావాలని విప్ జారీ చేశారు. ఏ ఒక్కరు రాకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలకు దూరంగా ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి కుమారస్వామి ఇవాళ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment