
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన టీఆర్‌ఎస్ నేతలకు దగ్గరయ్యారని రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందడానికి వ్యుహాత్మకంగా వ్యవహరించినట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. టీఆర్‌ఎస్ మద్దుతుతోనే ఆయన హెచ్‌సీఏ పదవిని కైవసం చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ కీలక నేత మధ్యవర్తిత్వంలో అజహరుద్దీన్ టీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యారని తెలుస్తోంది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా గెలుపొందిన అజహరుద్దీన్.. త్వరలో కేసీఆర్‌ను కలవనున్నట్టు చెప్పడం కూడా ఆయన టీఆర్‌ఎస్‌లో చేరనున్నారనే వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది. మరోవైపు అజహరుద్దీన్ పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్‌ఎస్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్టుగా సమచారం. ఏడాదిలోపు జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ అజహరుద్దీన్‌ను బలమైన మైనార్టీ నేతగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ వార్తలపై స్పందించిన.. అజహరుద్దీన్ తాను పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అయితే పార్టీ మార్పుపై వార్తలను ఖండించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment