
మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘోష నెరవేరిందని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి, నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ కూడా లాక్కున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ ఘోష ఇప్పుడు నెరవేరిందని, నిశ్చయ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్నారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఎలా చిత్తు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయిందన్నారు. ఏమాత్రం మనస్సాక్షి ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలన్నారు. జగన్ దేవుని దయతో గెలిచానని చెప్పడం ఎంతో సంతోషమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పేదలు, ఎస్సీ లు, బీసీ లకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ రాజకీయాలకు పోకుండా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తనకు కేసీఆర్‌కు ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆరేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment