
సాక్షి, తిరుపతి : తెలంగాణ తెలుగుదేశం మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు మరోసారి చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత ఎన్‌టీ రామారావు తనకు రాజకీయ భిక్ష పెట్టారని, ఆయన దయతోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎన్టీఆర్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని మండిపడ్డారు. చంద్రబాబు దుర్మార్గుడని తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయంలో తాను అండగా ఉన్నానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తన స్నేహితుడని అయినా కూడా చంద్రబాబును వెనుకేసుకొచ్చినట్లు తెలిపారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజున తనను బర్తరఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మొదటి ముద్దాయి అని అన్నారు. చంద్రబాబు నమ్మక ద్రోహి, వెన్నుపోటు దారుడని ఘాటు విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో గెలిచిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన రాజకీయ అసమర్ధుడు బాబు అని మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలను దోచుకోవడం చంద్రబాబుకు అలవాటని, అందుకే సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లకు ఎంపీ పదవులను అమ్ముకున్నారని ఆరోపించారు.
పదవులు ఇస్తానని మభ్యపెట్టడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని, గాలి ముద్దుకృష్ణమ నాయుడును మానసిక క్షోభకు గురిచేసి చంపారని విమర్శించారు. ఏపీ ప్రజలు కష్టాలు పడుతుంటే, చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్, కుటుంబం మాత్రమే సంతోషంగా ఉన్నారని దుయ్యబట్టారు. తనకు ఎదురు తిరిగిన వారిని బెదిరిస్తాడని లేకపోతే వారిని అంతమొందిచే వరకూ నిద్రపోడని విమర్శించారు. తనను కూడా పోలీసులు ద్వారా బెదిరించారని, అయినా తాను ఏమాత్రం భయపడనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించాలని స్వామిని కోరుకుంటానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment