
గార్లదిన్నె: తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేశారు. టీడీపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎందుకూ పనికిరాని వెధవలంటూ తిట్టిపోశారు. ఇక కమ్యూనిస్టులు పెద్ద దొంగలంటూ వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని మర్తాడు క్రాస్ సమీపంలో మంగళవారం రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలోనే అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను అసెంబ్లీకి వెళ్లకముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయంతో ఉండేవాడిననీ, కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా పనికిరాని వెధవులన్నారు. అందుకే ప్రభుత్వ పథకాలు సరిగా అమలుకాలేదన్నారు. కాగా, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే బాగుందన్నారు. ఈ విషయాన్ని ధైర్యంగా సీఎంకు చెప్పే ధైర్యం ఎవరికీలేదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం ఎవరికి ఉపయోగమో అర్థం కావడంలేదన్నారు. రేషన్ షాపుల్లో కొనుగోలు చేసే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు. జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తదితర టీడీపీ నేతలు నివ్వెరపోయారు. ‘నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు, ఇచ్చినా తట్టుకోలేడు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగలేదు. నేను మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు సచివాలయంలో ఉన్న వాళ్లంతా నా దగ్గర పనిచేశారు’ అని జేసీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment