
భోపాల్ : వచ్చే ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలు పెట్టేశాయి. ప్రత్యర్థి పార్టీ చేసే ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టేందుకు ప్రత్యేకంగా ‘సైబర్ సైన్యాన్ని’ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి శివరాజ్ సింగ్ దాబి మాట్లాడుతూ.. డిజిటల్ ప్రచారం కోసం ‘సైబర్ వారియర్స్’ పేరిట గత మూడు నెలల్లో 65 వేల మందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు. మరో 5 వేల మంది సిబ్బందిని త్వరలోనే రిక్రూట్ చేసుకుంటామన్నారు.
ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండడం యువ ఓటర్లను ఆకర్షించేందుకు వీలవుతుందని దాబి పేర్కొన్నారు. సామాన్య ప్రజలను, గ్రామీణ ఓటర్లను ‘వాట్సాప్’ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలను ప్రజల్లోకి సులభంగా చేరవేసే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. సైబర్ వారియర్స్‌తో సమావేశమై కార్యాచరణ గురించి వివరించారన్నారు.
రాజీవ్ కే సిపాయి...
సోషల్ మీడియాలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు ‘రాజీవ్ కే సిపాయి’ పేరిట 4 వేల మందిని నియమించుకున్నట్లు కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్‌చార్జి ధర్మేంద్ర వాజ్‌పేయి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రెవెన్యూ డివిజన్ల నుంచి మరో 5 వేల మందిని రిక్రూట్ చేసుకుని క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నామన్నారు. ‘రాహుల్ విత్ ఫార్మర్స్’ హాష్‌ట్యాగ్‌తో తాము ట్విటర్‌లో నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని, 23 గంటల పాటు ట్రెండింగ్ అయి... 1.25 లక్షల మంది పార్టిసిపెంట్‌లతో రికార్డు సృష్టించిందని వాజ్‌పేయి తెలిపారు. చెప్పాలంటే ఒక విధంగా తామే బీజేపీ కన్నా మెరుగైన స్థితిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment