రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు | MP Ranjith Reddy Political Life Story | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు

Published Sun, Jun 23 2019 3:36 PM | Last Updated on Sun, Jun 23 2019 7:47 PM

MP Ranjith Reddy Political Life Story - Sakshi

ఎంపీ రంజిత్‌రెడ్డి

ఆయన వెటర్నరీ డాక్టర్‌ ఉద్యోగం చేస్తూ పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించారు. దినదినాభివృద్ధి చెందుతూ అదే వ్యాపారంలో దేశంలోనే 5వ స్థానానికి చేరుకున్నారు. ఇంటర్‌ నుంచి కలిసి చదువుకున్న స్నేహితుడితో వ్యాపారం ఆరంభించి అగ్రశ్రేణికి ఎదిగారు. వ్యాపారంలో బాగా రాణించి ఉన్నతంగా స్థిరపడాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఆయనే.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి. కష్టాన్ని నమ్ముకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నానని, తమ వ్యాపారం దేశంలోనే గుర్తింపు పొందడం తృప్తినిచ్చిందని రంజిత్‌రెడ్డి చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ అనుకోలేదని, పౌల్ట్రీ రంగం నుంచి 
పార్లమెంట్‌లో అడుగుపెడతానని ఊహించలేదని అన్నారు. రంజిత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుటుంబ, వ్యాపార విశేషాలను వివరించారు.  
                         

చేవెళ్ల:  మా నాన్న స్వస్థలం పాత కరీంనగర్‌ జిల్లా జగిత్యాల మండలంలోని గొల్లపల్లి గ్రామం. మా తాతకు అప్పట్లో వంద ఎకరాల భూమి ఉంది. మా నాన్న రాజారెడ్డిని వ్యవసాయం చేసుకోవాలని చెబితే.. చదువుకుంటానని వరంగల్‌కు వచ్చి పాలీటెక్నిక్‌ చేశారు. ఇంజనీర్‌ ఉద్యోగం చేస్తూ వరంగల్‌లోనే  స్థిరపడిపోయారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. మేము వరంగల్‌లోనే జన్మించాం. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం  రాజ్యలక్ష్మీ, రవీందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి. నేను ఇంటర్‌ వరకు వరంగల్‌లోనే చదువుకున్నా. ఆ తరువాత రాజేంద్రనగర్‌లోని  అగ్రికల్చర్‌ యునివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేసి వెటర్నరీ డాక్టర్‌గా ఉద్యోగంలో చేరాను.
 
కష్టాన్ని నమ్ముకుని వ్యాపారంలో నంబర్‌ వన్‌గా నిలిచాం  
బీవీఎస్సీ పూర్తిచేసిన తరువాత స్నేహితుడు తిరుపతిరెడ్డి నేను ఇద్దరం రూ.3వేలకు ఉద్యోగం చేశాం. వరంగల్‌లో ఇంటర్‌ చదువుతున్నప్పటి నుంచి ఇద్దరం స్నేహితులం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. వెటర్నరీ డాక్టర్‌గా  పనిచేస్తున్న సమయంలో పౌల్ట్రీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. మేము ఇద్దరం కలిసి రూ.5లక్షల పెట్టుబడితో 1996లో వ్యాపారం ప్రారంభించాం. ఎస్‌ఆర్‌ హేచరీస్‌ పేరుతో ప్రారంభించిన మా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. పౌల్ట్రీ ఫీడింగ్, కోడిపిల్లల అమ్మకం రెండింట్లో దేశంలోనే టాప్‌ 5వ స్థానంలో నిలిచాం. 8వేల కోళ్లతో ప్రారంభించి 5లక్షల కోళ్ల వరకు పెంచాం. రోజుకు 2లక్షల చికెన్‌(కోళ్లు), 15లక్షల గుడ్ల ఉత్పత్తి, 35వేల టన్నుల ఫీడ్‌ను  అందించే స్థాయికి మా వ్యాపారం అభివృద్ధి చెందింది. 

పిల్లల బాధ్యత నా భార్యదే.
1992లో వరంగల్‌కు చెందిన సీతారెడ్డితో నాకు వివాహం జరిగింది. వ్యాపారంలో ఎంత బీజీగా ఉన్నా ఫ్యామిలీకి వీలైనంత సమయం కేటాయిస్తాం. నేను, నా స్నేహితుడు తిరుపతిరెడ్డి కుటుంబాలతో కలిసి సమయం దొరికినప్పుడల్లా విహార యాత్రలకు ప్లాన్‌ చేసుకుంటాం. వ్యాపారంలో బాగా రాణించి ఉన్నతంగా స్థిరపడాలనేదే   లక్ష్యంగా ఉండేది. వివాహం చేసుకున్న మొదట్లో నేను, నా స్నేహితుడు ఇద్దరం రూ.3 వేలకు ఉద్యోగం చేసే వాళ్లం. మాకు వచ్చే జీతానికి ఒక్కరే సంతానం చాలు అనుకున్నాం. దీంతో నాకు, తిరుపతిరెడ్డికి మొదటి సంతానంగా కూతుళ్లు పుట్టారు. ఇక చాలు అనుకున్నాం. కానీ, వ్యాపారం ప్రారంభించిన తరువాత బాగా రాణిస్తున్న సమయంలో మరో సంతానం ఉంటే బాగుంటుందని ఆలోచించాం. ఆ తరువాత కుమారుడు రాజాఆర్యారెడ్డి జన్మించాడు.   నా భార్య సీతారెడ్డి డిగ్రీ వరకు చదువుకుంది. వ్యాపారంలో నేను బీజీగా ఉంటుండడంతో పిల్లల బాధ్యత మొత్తం ఆమే చూసుకునేది.    కుటుంబ నిర్వహణ మొత్తం ఆమెదే. కూతురు పూజాఆకాంక్షకు ఇటీవల వివాహం చేశాం. అల్లుడు డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, కూతురు పూజా ఆకాంక్ష ఇద్దరూ ఫార్మా వ్యాపారంలో ఉన్నారు. కుమారుడు రాజాఆర్యా అమెరికాలో చదువుకుంటున్నాడు. పిల్లలు సెటిల్‌ అవుతుండటంతో ఇప్పుడు సీతారెడ్డి సోషల్‌ సర్వీస్‌పై ఎక్కువగా దృష్టి సారించింది.

వ్యాపారానికి పుల్‌స్టాప్‌ పెట్టి రాజకీయాల్లోకి.. 
వ్యాపారంలో బాగా రాణించా. రూ.1200 కోట్ల టర్నోవర్‌ వరకు  వెళ్లిన మా వ్యాపారాన్ని ఏడాది క్రితం ఓ ఇంటర్నేషనల్‌ కంపెనీ  టేకోవర్‌ చేసింది. నేను చేసే పౌల్ట్రీ ఫీడ్‌ వ్యాపారం మొత్తం అమ్మేశాను. నా స్నేహితుడు కోడిపిల్లల వ్యాపారం చూసుకుంటున్నాడు. నేను వ్యాపారం మానేసిన తరువాత ఇప్పుడు సమయం ఉంటుందని వెళ్లి కేసీఆర్‌ సార్‌ను కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని అడిగా. రాజకీయాల్లోకి  వచ్చిన నాకు  రామన్న(కేటీఆర్‌) ఎంపీగా అవకాశం కల్పించారు. 2004 నుంచి     మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రాంమోహన్‌ మేమంతా ఒక గ్రూప్‌గా ఉండేవాళ్లం.   ఈటల రాజేందర్‌ నేను కలిసి ఉండేవాళ్లం. ఈటలకు పౌల్ట్రీ  ఉండటంతో నేను డాక్టర్‌గా పనిచేసేవాడిని. దీంతో వ్యాపారంలో మంచి స్నేహితులం అయ్యాం. రాజకీయాల్లో రాజేందర్‌ మొత్తం వ్యవహారం నేనే చూసేవాణ్ని. బాగా కష్టపడి గెలిపించుకున్నాం.  అప్పటి నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నా. బిజినెస్‌పరంగా బాగా సెటిల్‌ అయిన తరువాత ప్రత్యక్షంగా వచ్చేందుకు ఆలోచిద్దామని అనుకున్నా. వ్యాపారం మానేయడంతో ఇప్పుడు సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చా. నన్ను ఆదరించి గెలిపించిన చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తా. కేసీఆర్‌ సార్‌ ఎంతో నమ్మకంతో  అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

భార్య సీతారెడ్డితో ఎంపీ రంజిత్‌రెడ్డి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement