సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ బీజేపీలోకి ఫిరాయించినప్పటికీ.. ఇంకా టీడీపీలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. మాట జారి తడబడ్డారు. సమావేశం ప్రారంభంలోనే మా తెలుగుదేశం పార్టీ నేతలు అంటూ నాలుక కరచుకున్నారు. ఇంతలోనే అక్కడున్న మీడియా ప్రతినిధులు ‘సార్ మీరు బీజేపీలో ఉన్నార’ని గుర్తుచేయడంలో సరిచేసుకున్నారు. పొరపాటును సరిదిద్దుకుంటూ.. తెలుగుదేశం కాదు.. తెలుగు ప్రజలు అని సవరించుకోవాలని సూచించారు. కుదరక, మళ్లీ మొదటి నుంచి చెబుతానంటూ మీడియా సమావేశాన్ని తొలినుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులపై సానుకూలంగా స్పందించారు.
మూడు ప్రాంతాల్లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, వాటి బ్రాంచులు ఉండాలన్న నిర్ణయాన్ని సమర్థించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ‘నాది రాయలసీమ, నా మామది అమరావతి, నా బిడ్డనిచ్చింది విశాఖపట్నం’ అందుకే అందరి కోసం మూడు రాజధానులుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా అభివృద్ధి వికేంద్రీకరణకు టీజీ వెంకటేష్ ఇదివరకే మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment