
సాక్షి, హైదరాబాద్ : టీడీపీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉండదని, ఏపీకి ప్రత్యేక హోదా అంశం సాధించే విషయంలో అనారోగ్యం పాలైతే పట్టించుకున్న నాథుడు లేడని కాకినాడ సిట్టింగ్ ఎంపీ తోట నరసింహం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని ఆదుకోవాల్సిన కనీస బాధ్యతను టీడీపీ మరిచిందని మండిపడ్డారు. టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమక్షంలో తన భార్య తోట వాణితో కలిసి ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
‘దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనారోగ్యం పాలైన జక్కంపూడి రామ్మోహన్‌రావుని ఆయన శ్రద్ధ చూపి ఆదుకున్నారని గుర్తు చేశారు. అది నాయకుడి మంచి లక్షణాలకు ఒక పెద్ద ఉదాహరణ. అది వైఎస్సార్ గొప్పతనం. ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇచ్చే విషయం కాదు. కానీ టీడీపీలో కనీస గౌరవ, మర్యాద ఇవ్వలేదు. అందుకనే టీడీపీనీ వదిలేశాను. ఇకనుంచి జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తాము. ఆయన నాయకత్వంలొనే ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాము. టికెట్ కేటాయింపు అధినేత ఇష్టం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే. చంద్రబాబుకు మేమిచ్చిన గౌరవాన్ని నిలుపుకోలేదు. 5 శాతం కాపు రిసర్వేషన్ల అమలు దేవుడి చేతిలో ఉంది’ అని వ్యాఖ్యానించారు.
ఇది శుభసూచకం..
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరడం శుభ సూచకమన్నారు తోట వాణి. ఆరోగ్యం లెక్క చేయకుండా నరసింహం టీడీపీ కోసం పని చేస్తే కనీసం ఎవరూ లెక్క చెయ్యలేదని మండిపడ్డారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదని వాపోయారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు కూడా చేయకపోవడం చాలా బాధ అనిపించిందన్నారు. కబ్జాలు, మైనింగ్‌క్వారీలను మింగేసిన వారికి టికెట్ ఇవ్వడమే టీడీపీ సర్వేనా అని సూటిగా ప్రశ్నించారు. తన భర్త ఆరోగ్యం విషయంలో వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు’ అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment